– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి సీఐటీయూ సమ్మెనోటీస్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ…ఫిబ్రవరి 16న జాతీయ కార్మిక, రైతు సంఘాలు తలపెట్టిన సమ్మెలో పాల్గొంటామని తెలంగాణ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) తెలిపింది. ఈమేరకు శనివారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి యూనియన్ గౌరవాధ్యక్షులు జె.వెంకటేష్, అధ్యక్షులు మెట్టు రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నారాయణ సమ్మె నోటీస్‌ను అందజేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ ప్లాట్ ఫాం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఐన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ, ఐఎఫ్‌టీయూ, ఐఎఫ్‌యూ, బీఆర్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఏఐయూటీయూసీి) కార్మిక సంఘాలు, వివిధ రంగాల ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా (రైతు-వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక) అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మెతోపాటు గ్రామీణ భారత్ బంద్ పాటించాలని నిర్ణయించాయని వారు గుర్తు చేశారు. పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్-22 సబ్ సెక్షన్ (1) అనుసరించి ఈ సమ్మె నోటీస్ అందజేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. .
మేము సైతం…
కాకతీయ విశ్వవిద్యాలయంలో గత 25 ఏండ్లుగా పని చేస్తున్న దినసరి వేతనం, లంప్సమ్, క్యాజువల్ తదితర ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టు విధానంలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు శనివారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి ఇదే అంశంపై వారు సమ్మె నోటీస్ అందజేశారు. ఉద్యోగుల్లో అభద్రతాభావం నెలకొందని పేర్కొన్నారు. గత ఆరేండ్లుగా జీతాలు పెరగకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, విద్య, వైద్యం, ఇంటి కిరాయిలు తదితర ఖర్చులతో ఈ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాకతీయ యూనివర్సిటీలో కొత్తగా ప్రవేశపెట్టనున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.