– ఎల్‌ఆర్‌ఎస్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ పత్రాలివ్వాలి : వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాల్లోని పేదల భూములు, కాలువులు, చెరువుల కబ్జాల భూము లను కాపాడేందుకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు తెలిపారు. పడావుబడ్డ భూముల రక్షణ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ పరిధిలోని ఆయా జిల్లాల నాయకులతో బి.రామచందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ..రియల్టర్లు పేరున్న ప్రముఖులు, హీరోలతో తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. లక్షల ఎకరాల పచ్చని పంట పొలాలను రియల్టర్లు బీడు భూములుగా మార్చారన్నారు. డీటీపీసీ లేఅవుట్లు లేకుండా అసైన్డ్, కాలువలు, చెరువుల పక్కన భూములను కబ్జా చేసి ప్రజలను మభ్యపెట్టి కట్టబెడుతున్నారని విమర్శించారు. మైనింగ్ పర్మిషన్ లేకుండా వెంచర్లలోకి మట్టిని తరలిస్తున్నారన్నారు. పచ్చని పంటలు పండే భూములకు రిజిస్ట్రేషన్ ఫీజు కడితే చాలు నాలాలోకి కన్వర్షన్ చేయడం సరైందికాదన్నారు. హైవేల పక్కన అనేక వెంచర్లు వేసి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారనీ, వాటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో మూడు లక్షల మంది లబ్దిదారులు డబ్బులు చెల్లించారనీ, వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులే చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ధరణి నుంచి కాస్తు కాలం 16 తొలగింపు వల్ల పేదలు తమ భూములను కోల్పోతున్నారనీ, ఆ కాలాన్ని పునరుద్ధరించాలని విన్నవించారు. డిటిసిపీ, హెచ్‌ఎండీఏ, వైటిడిఏ పర్మిషన్లు లేనటువంటి వాటిపై రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ అథారిటీలో రాబోయే రోజుల్లో ఫిర్యాదు చేస్తామన్నారు. రియల్టర్ల నుంచి ప్రభుత్వ, కబ్జా భూములను కాపాడేందుకు తమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. నర్సిములు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కందుకూరి జగన్, మెదక్ జిల్లా కార్యదర్శి కె.మల్లేశం, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆంజనేయులు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.