– సంక్షేమ పాలన అందిస్తాం
– పథకాలు ఇంటింటికీ చేరుస్తాం
– క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో, రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీయేనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. డిసెంబర్‌లో అద్భుత జరగబోతుందని ముందుగానే చెప్పానని గుర్తు చేశారు. ప్రపంచానికే డిసెంబర్ నెల మిరాకిల్ మంత్ అని చెప్పారు. ఎందుకంటే యేసు ప్రభువు జన్మదినమే కారణమన్నారు. దేశంలో సెక్యులర్ భావాలను కాపాడటం కాంగ్రెస్ ప్రధాన బాధ్యతని చెప్పారు. మొన్న కర్ణాటక.. నిన్న హిమాచల్ ప్రదేశ్… నేడు తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. అప్పుడే మణిపూర్‌లాంటి ఘటనలకు బ్రేక్ పడుతుందన్నారు. ప్రస్తుతం దేశ రక్షణ ప్రమాదంలో పడిందని చెప్పారు. మణిపూర్‌లో మారణహోమం జరిగితే..ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని విమర్శించారు. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికల ప్రచారం ముఖ్యంగా భావించారని తెలిపారు. రాహుల్‌గాంధీ పరామర్శించాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారని విమర్శించారు. నిస్సహాయులకు సహాయం అందించడం మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హత కలిగిన వారికి అవకాశాలు కల్పించటమే ద్యేయమని చెప్పారు. అందుకు ఉదాహరణగా ఏకే ఆంటోనీ, పెర్నాండెజ్‌లకు కాంగ్రెస్ ఎంతో ప్రోత్సాహాన్ని అందించిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యంలో పేదల అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. సంక్షేమ పథకాలను ప్రతీ పేదకు చేరేలా చూస్తామని మాటిచ్చారు. మేం పాలకులం కాదు.. సేవకులమని చెప్పారు. ఏసు క్రీస్తు మాకు ఆదర్శమన్నారు. ఏ సమ్మస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను, సంస్థలను సీఎం ఆవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ రవిగుప్త, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్ యాదవ్, సంపత్‌కుమార్, క్రైస్తవ మతపెద్దలు, ఫాస్టర్లు, అధికారులు పాల్గొన్నారు.