ఏర్గట్ల మండలకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులు,కార్యకర్తలు రుణమాఫీ అంశంపై సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు పూర్ణానందం,మాజీ ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి మాట్లాడుతూ… రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తూ… డిసెంబర్ 9 అని ఒకసారి ఆగస్టు 15 అని ఒకసారి దేవుళ్ళపై ప్రమాణం చేసి,రైతులను అవమానపరచడం ఆయను తగదని అన్నారు.ఏర్గట్ల మండలంలో రుణమాఫీకి అర్హులైన రైతులు 4264 మంది ఉన్నారని,అందులో ఈ రోజు వరకు 997 మంది రైతులకు మాత్రమే తూతుమంత్రంగా రుణమాఫీ జరిగిందని అన్నారు.మరో మూడు,నాలుగు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే బీఆర్ఎస్ పార్టీ తరపున రైతులకు అండగా నిలిచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.