– త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో పది వేల పోస్టుల భర్తీ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
– హుజూర్‌నగర్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రుల సమీక్ష
నవతెలంగాణ-హుజూర్‌నగర్
పేదవాళ్లకు నమ్మకం కుదిరేలా.. 75 శాతం మంది పేదలు ప్రభుత్వాస్పత్రులకు వచ్చే విధంగా అన్ని రకాల వసతులు, కావాల్సిన మందులను సమకూర్చుతామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని వంద పడకల ఆస్పత్రిలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రుల్లో మరిన్ని వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. సిబ్బందికి కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆస్పత్రి విస్తరణ గురించి అధికారులతో చర్చించారు. వైద్యశాలలో డాక్టర్లు రాసిన అన్ని మందులు ఆస్పత్రిలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఖాళీగా ఉన్న 35 డాక్టర్ పోస్టులు నింపుతామని తెలిపారు. మెడికల్ టీచింగ్ హాస్టల్‌ను మంజూరు చేస్తామన్నారు. రూ.5లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంచామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా 1672 వైద్యసేవలు గతంలో అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం వాటిని 1800 వరకు పెంచామన్నారు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు డైట్, శానిటేషన్ డ్రగ్స్‌పై నిత్యం మానిటరింగ్ చేయాలన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న మెడికల్ కళాశాలకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరిస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో పది వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుతం రూ.487 కోట్ల ఆర్థికభారం పడుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు సీఎస్‌ఎస్ ఫండ్ ద్వారా వైద్య ఆరోగ్యశాఖకు నిధులివ్వాలని కోరారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో మౌలిక సదుపాయాలు, కావాల్సిన వస్తువుల గురించి, సౌకర్యాల గురించి నివేదిక పంపితే ప్రభుత్వం జాప్యం లేకుండా నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న పీహెచ్‌సీ సెంటర్లు, అక్కడ వైద్యం, వసతుల గురించి ఆయా పీహెచ్‌సీ డాక్టర్లు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శితోపాటు ఆరోగ్య శాఖ కమిషనర్ అజరు, కలెక్టర్ వెంకట్రావు, డీఎంహెచ్‌ఓ కోటాచలం, ఆస్పత్రి సూపరింటెండెంట్ కరణ్, ఆర్‌ఎంఓ రవి, అదనపు జేసీ వెంకట్‌రెడ్డి, డీఎస్పీ ప్రకాశ్‌యాదవ్, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ నాగార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గెల్లి అర్చనరవి, టీపీసీసీ జాయింట్ సెక్రెటరీ తన్నీరు మల్లికార్జున్, జక్కుల మల్లయ్య, పోతుల జ్ఞానయ్య, గరిడేపల్లి ఎంపీపీ పెండెం సుజాతశ్రీనివాస్, గోల మట్టయ్య పాల్గొన్నారు.