అసెంబ్లీలో లగచర్ల సమస్యను లేవనెత్తుతాం

– భూ సేకరణ రద్దయ్యే వరకూ పోరాడుతాం : బాధితులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల సమస్యను లేవనెత్తుతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. అక్కడ భూ సేకరణ రద్దయ్యే వరకూ పోరాడుతామని ఆయన వ్యాఖ్యానించారు. లగచర్లకు చెందిన పలువురు భూ సేకరణ బాధితులు శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చారు. కేటీఆర్‌ను కలిసి తమగోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ లగచర్ల ఘటనకు సంబంధించి అన్యాయంగా నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వికారాబాద్‌ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటామని హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్య వతి రాథోడ్‌, శ్రీనివాసగౌడ్‌, సీనియర్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.
ఎప్పుడూ ప్రజల కోసమే పని చేస్తాం
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పని చేస్తామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకులు రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ”నమ్మి నానపోస్తే” అనే లఘు చిత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సర్కార్‌ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు.
మేం మీకు అండగా ఉంటాం :ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులకు మాజీ మంత్రి హరీశ్‌రావు హామీ
రీజనల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హామీనిచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు చెందిన పలువురు బాధితులు శనివారం హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిశారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధలకు విరుద్ధంగా సర్వేలు చేస్తున్నారనీ, భూ సేకరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వారికి ధైర్యం చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ముఖమంత్రి రేవంత్‌ను, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ను వదిలిపెట్టబోమనీ, బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని భరోసానిచ్చారు.