లోపాలను సమీక్షించుకుంటాం ప్రజలపక్షాన ఉంటాం

లోపాలను సమీక్షించుకుంటాం ప్రజలపక్షాన ఉంటాం– ప్రజాసమస్యలకే సీపీఐ(ఎం) అధిక ప్రాధాన్యత : జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైపు నుండి జరిగిన లోపాలను సమీక్షించుకొని, జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లాకేంద్రం లోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్‌లో నిర్వహించిన సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లా డారు. సీపీఐ(ఎం), ప్రజా సంఘాల నుండి రావాల్సిన ఓట్లను ఎన్నికలో రాబట్టులేకపోయామన్నారు. దీనిపై పార్టీ ఆత్మపరిశీలన చేసుకొని ముందుకు సాగుతామన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు సంబంధించిన వారు విచ్చలవిడిగా డబ్బు, మద్యం వంటి అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేసి ఓట్లను ఆకర్షించే విధంగా చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్చించి పార్టీ వారు ఎంతటి వారైనా పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.పార్టీ క్యాడర్‌ మరింత ప్రజలకు దగ్గరకు కావాలన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడాలని పార్టీ నిర్మాణాన్ని చక్కదిద్దుకోవాలని సూచించారు.కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు.కాంగ్రెస్‌ చేసే ప్రతి మంచి పనికి పార్టీ మద్దతు, సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని, ప్రజా సమస్యలకే అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఓడినా,గెలిచినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటంలో ముందువరుసలో ఉంటామన్నారు.పార్టీ జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లులక్ష్మీ, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్‌రావు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.