నవ తెలంగాణ-సిద్దిపేట కలెక్టరేట్
మల్లనసాగర్ ముంపు గ్రామాల ప్రజలు నివసిస్తున్న గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. బుధవారం సమీకత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగం, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ ముంపు గ్రామాలు ఎర్రవల్లి, సింగారం, ఏటిగడ్డ కిష్టాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహాడ్, వేముల గట్టు, కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాలు మామిడాల, బైలంపుర్, తానెదార్ పల్లెవారీగా ఆర్ అండ్ ఆర్ కాలనీలలో గ్రామపంచాయతీ ఎలక్షన్స్‌లోపు విలేజ్ మ్యాప్ తయారు చేయాలన్నారు. ఆర్ ఆండ్ ఆర్ కాలనీలో మౌలిక వసతుల కల్పన, ఓపెన్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ సైతం పూర్తి చేయాలన్నారు. డిపార్ట్మెంట్‌వారీగా ఏమైనా బకాయిలు ఉంటే నోట్ తయారీ చేసి ఉన్నతాధికారులకు పంపాలని తెలిపారు. సమావేశంలో సిద్దిపేట గజ్వేల్ ఆర్డీవోలు రమేష్ బాబు, బన్సీలాల్, విద్యుత్ శాఖ ఎస్‌ఇ మహేష్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.