నీ లెక్క తేలుస్తాం

– బ్రిజ్‌భూషణ్‌ ప్రకటనపై రెజ్లర్లు
– ఒక రేపిస్టు వేధింపులపై గళమెత్తడం ఆశ్చర్యంగా ఉంది : బ్రిజ్‌భూషణ్‌కు నెటిజన్లు చురకలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తప్పకుండా నీ లెక్క తేలుస్తామని బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు రెజ్లర్లు బదులిచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ ఎంపీ, మాజీ రెజ్లింగ్‌ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మంగళవారం ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఎవరి దగ్గర ఆధారాలు లేవని, ఆరోపణలు చేసిన ఆటగాళ్లు ఉదయం ఒకలా, సాయంత్రం మరోలా మాట్లాడుతున్నారని అన్నారు. మహిళా రెజ్లర్లకు తగిన న్యాయం జరిగిందని పేర్కొన్న ఆయన, జంతర్‌ మంతర్‌ వద్ద వాళ్లు నిరసనలు తెలిపినప్పుడు వారికి మద్దతుగా రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌తో పాటు సచిన్‌ పైలట్‌, ప్రియాంక గాంధీ వచ్చారన్నారు. మహిళా రెజ్లర్లకైతే న్యాయం జరిగింది కానీ, వారికి మద్దతుగా జంతర్‌ మంతర్‌ వద్దకు వచ్చిన రాజస్థాన్‌ సీఎం మాత్రం తన రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్‌ మహిళా విభాగానికి న్యాయకత్వం వహిస్తున్న ప్రియాంక గాంధీ మౌనం పాటించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో లైంగికదాడి ఘటనలు జరుగుతున్నాయని, రాజస్థాన్‌లో మహిళలు న్యాయం కోసం అడుగడు గునా పోరాడుతున్నారని బ్రిజ్‌ భూషణ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలకు పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే.. ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రియాంక గాంధీని అడుగుతున్నానని చెప్పారు. అంతేకాదు.. ఈ ఘటనలపై సోనియా గాంధీ ఎందుకు స్పందించడం లేదని, ఆమె నోటికి ఎవరు తాళం వేశారని నిలదీశారు. రాష్ట్రంలోని ఆడవాళ్లకు గెహ్లాట్‌, పైలట్‌ ఎప్పుడు న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో నెటిజన్లు సైతం బ్రిజ్‌భూషణ్‌పై తిట్లపురాణం సంధిస్తున్నారు. ఒక రేపిస్టు వేధింపులకు వ్యతిరేకంగా గలమెత్తడం ఆశ్చర్యంగా ఉందని చురకలంటిస్తున్నారు. దీంతో.. బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫోగట్‌ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. నీ లెక్కలు తప్పకుండా తేలుస్తామని హెచ్చరించారు.
బ్రిజ్‌భూషణ్‌ చేసిన ట్వీట్‌ని రెజ్లర్‌ బజరంగ్‌ పునియా రీట్వీట్‌ చేస్తూ.. ”మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి, ఇతరులకు అద్దం చూపిస్తున్నాడు. బ్రిజ్‌ భూషణ్‌ అధికార పార్టీకి చెందిన ఎంపీ కాకపోయి ఉంటే, ఆయన కథ మొత్తం బట్టబయలై ఉండేది. అధికార రక్షణలో రెజ్లింగ్‌ని కబ్జా చేసి, నువ్వు చేసిన దారుణ పనులు.. భారత క్రీడా చరిత్రలో నల్ల అక్షరాలతో లిఖించబడతాయి” అని మండిపడ్డారు. అనంతరం బ్రిజ్‌భూషణ్‌పై వినేశ్‌ ఫోగట్‌ ధ్వజమెత్తుతూ.. ”మహిళా రెజ్లర్లకు ఎలాంటి న్యాయం దక్కలేదు. నీలాంటి రేపిస్ట్‌లకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది. ప్రస్తుతం నువ్వు ప్రభుత్వ రక్షణలో రెజ్టింగ్‌ విభాగంపై ఆధిపత్యం చెలాయిస్తున్నావు. బాధిత మహిళా రెజ్లర్లకు సవాల్‌ విసురుతున్నావ్‌. నన్ను నమ్ము.. కచ్చితంగా మహిళా రెజ్లర్లు నీ లెక్క తేలుస్తారు. మహిళాల రాడికల్‌ ఉద్యమం నుంచి మేమెంతో నేర్చుకున్నాం. నీ లెక్క తేల్చే తీరుతాం” అంటూ హెచ్చరించారు.