జేపీఎస్‌లను క్రమబద్ధీకరిస్తాం…

– విధి విధానాలు ఖరారు చేయాలంటూ సీఎం కేసీఆర్‌ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్‌)ల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలంటూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాను ఆయన ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఈ మేరకు నిర్ణయించారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేయటానికి వీలుగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తోపాటు అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ సభ్యులుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుంచి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్‌వోడీ స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమిస్తారు. జిల్లా స్థాయి కమిటీలు పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. రాష్ట్రంలోని కొన్ని గ్రామ పంచాయతీల్లో తాత్కాలిక ప్రాతిపదికన జేపీఎస్‌లను గతంలో కలెక్టర్లు నియమించారు. ప్రస్తుత క్రమబద్ధీకరణ తర్వాత ఆయా స్థానాల్లో కూడా కొత్త జేపీఎస్‌ల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్‌, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీశ్‌శర్మ, సీఎస్‌ శాంతికుమారితోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.