గొర్ల పంపిణీని వేగవంతం చేస్తాం

–  జూన్‌లోపు పదివేల మందికి పంచుతాం
 – 300 కి.మీ బయట అనుమతి
–  నగదు బదిలీపై సర్కారే నిర్ణయం తీసుకోవాలి
–  జీఎంపీఎస్‌ బృందానికి పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ హామీ
– 12న తలపెట్టిన ముట్టడి కార్యక్రమం తాత్కాలిక వాయిదా : ఉడుత రవీందర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గొర్ల పంపిణీ ఆలస్యమవుతుండటంతో గొర్రెల, మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్‌) బాటపట్టింది. ఇప్పటికే ఆయా జిల్లాలు, మండల కేంద్రాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోవడంతో ఈనెల 12న పశుసంవర్థక శాఖ వద్ద ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించింది. దీనికి స్పందించిన పశ సంవర్థక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. రాంచందర్‌…బుధవారం జీపీఎంఎస్‌ రాష్ట్ర బృందాన్ని చర్చలకు ఆహ్వానించారు. ఇందులో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిల్లె గోపాల్‌, ఉడుత రవీందర్‌, రాష్ట్ర నాయకులు అవిశెట్టి శంకరయ్య, బొల్లం అశోక్‌, కాడబోయిన లింగయ్య, అమీర్‌పేట్‌ మల్లేష్‌, మద్దెపురం రాజు, పరికి మధుకర్‌, కాల్వ సురేష్‌, కడెం లింగయ్య, ఎక్కలదేవి కొమురయ్య తదితరులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గొర్ల కాపర్లకు సంబంధించిన పది డిమాండ్లను డైరెక్టర్‌ ముందుంచారు. గొర్ల పంపిణీలో దళారుల ప్రమేయం లేకుండా నగదు బదిలీ చేయాలనే డిమాండ్‌ మంచిదే అయినప్పటికీ అది తన పరిధిలో లేదని డైరెక్టర్‌ చెప్పారు. గొర్ల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. జులై నెలఖారులో పదివేల మందికి పంపిణీ చేస్తామని తెలిపారు. గొర్ల యూనిట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కొనుగోలు కేంద్రాలను రద్దు చేయాలని పట్టుబట్టారు. డీడీ చెల్లించిన లబ్దిదారులు 300 కిలో మీటర్ల బయట గొర్లను ఎంపిక చేసుకుని కొనుకునేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పుడు పెంపకందార్లు తమకు నచ్చిన చోట గొర్లను కొనుక్కోవచ్చని సూచించారు. మొదటి విడతలో మిగిలిపోయిన లబ్దిదారులకు, రెండోవిడత లబ్దిదారులకు గొర్లను పంపిణీ చేస్తామని వివరించారు. గొర్ల పంపిణీకి కుల ధ్రువీకరణ సర్టిఫికేెట్లు ఇవ్వాలంటూ అధికారులు మెలిక పెడుతున్నారనీ, దీంతో డబ్బు, సమయం వృథా అవుతుందనీ, సొసైటీలు ఎంపిక చేసిన లబ్దిదారులకు గొర్ల యూనిట్లు ఇవ్వాలని జీఎంపీఎస్‌ బృందం కోరింది. ఈ అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ-లాబ్‌ నమోదు కార్యక్రమంలో తప్పిపోయిన పేర్లను గుర్తించి సరిదిద్దుతామని తెలిపారు. సొసైటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులను నియమిస్తామని హామీ ఇచ్చారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన గొర్లకు బీమాను చెల్లించని కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నట్టల మందులను సరఫరా చేస్తున్నామనీ, ఎక్కడైనా అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం ఉడుత రవీందర్‌ మాట్లాడుతూ ఈనెల 12న తలపెట్టిన ముట్టడి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.