ఢిల్లీకి పాలు, నీళ్లు నిలిపేస్తాం

– బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలి
– ఖాప్‌ పంచాయతీల డిమాండ్‌
– 18న భారత్‌ బంద్‌కు పిలుపు
న్యూఢిల్లీ : రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హర్యానాలోని ఖాప్‌ పంచాయితీలు బుధవారం బంద్‌ నిర్వహించాయి. ఢిల్లీ-హర్యానా జాతీయ రహదారిని రైతులు దిగ్బందించారు. ఖాప్‌ పంచాయతీల బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు మద్దతునిచ్చాయి. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయకుంటే ఢిల్లీకి పాలు, నీళ్ల సరఫరా నిలిపివేస్తామని ఖాప్‌ పంచాయతీలు హెచ్చరించాయి. హర్యానా బంద్‌ తరువాత ఖాప్‌ పంచాయతీలు ఈ నెల 18న భారత్‌ బంద్‌ ప్రకటించాయి. ఇందుకోసం ఇతర రాష్ట్రాల రైతు సంఘాలను సంప్రదించి సన్నాహాలు చేసేందుకు 21 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటుచేశారు. దీనితో పాటు, ఇతర రాష్ట్రాల వ్యాపార బోర్డులు, రాజకీయ పార్టీలు, ఖాప్‌ల ప్రతినిధులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ అరెస్టు, రైల్‌ కారిడార్‌కు పరిహారం, రుణమాఫీ, తదితర అంశాలతో కూడిన 25 అంశాల చార్టర్‌ను రూపొందించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపే బాధ్యతనూ ఈ 21 మంది సభ్యుల కమిటీకి అప్పగించారు.
బ్రిజ్‌ భూషణ్‌ కుటుంబ సభ్యులెవరూ డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో పోటీ చేయరు
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు అర్హత ఉన్నప్పటికీ రాబోయే ఫెడరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయరని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, నలుగురు వైస్‌ ప్రెసిడెంట్లు, సెక్రటరీ జనరల్‌, ట్రెజరర్‌, ఇద్దరు జాయింట్‌ సెక్రటరీలు, ఐదుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్ల స్థానాలకు జూలై 6న ఎన్నికలు జరగనున్నాయి.
రాబోయే ఎన్నికలలో బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు లేదా అతని సహచరులు పోటీ చేసేందుకు అనుమతించకూడదన్నది క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వద్ద రెజ్లర్లు లేవనెత్తిన డిమాండ్లలో ఒకటి. అందుకు రెజ్లర్లకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. సింగ్‌ కుమారుడు కరణ్‌ భూషణ్‌ ఉత్తరప్రదేశ్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌కు నాయకత్వం వహిస్తుండగా, అతని అల్లుడు ఆదిత్య ప్రతాప్‌ సింగ్‌ బీహార్‌ యూనిట్‌కు అధిపతిగా ఉన్నారు. ‘ఆయన కుమారుడు కరణ్‌, అతని అల్లుడు ఆదిత్య డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలకు నామినేషన్లు వేయకూడదని నిర్ణయించుకున్నారు’ అని సింగ్‌ సన్నిహిత వర్గాలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వివాదానికి మరింత ఆజ్యం పోసేలా చేయడం మంచిది కాదని, అయితే కరణ్‌, ఆదిత్య ఇద్దరూ ఎన్నికలలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.