– దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించే పార్టీని బలపరుస్తామని దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల పోచయ్య ఇజ్రాయేల్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా ఇజ్రాయేల్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల కోసం దళిత క్రైస్తవులు 50 ఏండ్లకు పైగా పోరాడుతున్నారని గుర్తుచేశారు. ఈ అంశంపై వివిధ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిపై లోతుగా చర్చించినట్టు తెలిపారు. తమను దూరంగా ఉంచిన పార్టీలను తాము కూడా పార్లమెంటు ఎన్నికల్లో దూరంగా పెట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సమితి యూత్ అధ్యక్షునిగా పల్లె జోసఫ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. సమావేశంలో నాయకులు జాన్సన్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.