– పోలండ్‌లో ప్రధాని మోడీ
– డొనాల్డ్ టస్క్‌తో ద్వైపాక్షికాంశాలపై చర్చ
వార్సా: ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమాసియా లో కొనసాగుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందోళన కరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన.. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు తాము మద్దతు తెలుపు తామన్నారు. పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో భేటీ అయిన తర్వాత మీడియాకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడిం చారు.
”ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొన సాగు తున్న యుద్ధాలు మనందరికీ తీవ్ర ఆందోళన కరం. యుద్ధక్షేత్రంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకదని భారత్ బలంగా విశ్వసిస్తుంది. ఏ సంక్షోభంలోనైనా సామాన్యులు ప్రాణాలు కోల్పో వడం యావత్ మానవాళికే అతిపెద్ద సవాల్. చర్చలు, దౌత్యంతోనే శాంతి, స్థిరత్వానికి మేం మద్దతిస్తాం. ఇందుకోసం మిత్రదేశాలతో కలిసి అన్నిరకాల మద్దతు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది” అని ప్రధాని పేర్కొన్నారు.
పోలండ్ పీఎంతో భేటీ..
రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలండ్ వెళ్లిన మోడీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించామని.. ఇరుదేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. రష్యా దండయాత్ర సమయంలో భారత విద్యార్థుల తరలింపునకు పోలండ్ ఎంతో సహకరించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. అంతకుముందు అక్కడి ప్రధానమంత్రి కార్యాలయం ‘ఛాన్స్‌లరీ’లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది.