కల్వల ప్రాజెక్టు ఆయకట్టు రైతులను ఆదుకుంటాం..

– త్వరలోనే మత్తడి నిర్మాణం చేపడుతాం
– ఆందోళన చెందొద్దని అన్నదాతలకు భరోసా
– తెగిన మత్తడిని పరిశీలించిన విప్ కౌశిక్ రెడ్డి, కలెక్టర్ గోపి, సీపీ సుబ్బారాయిడు
నవతెలంగాణ-వీణవంక/కేశవపట్నం
కల్వల ప్రాజెక్టు పరిధిలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, తెగిన మత్తడిని వెంటనే నిర్మించేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షానికి భారీగా వరద తాకిడికి కేశవపట్నం మండల పరిధిలోని కల్వల ప్రాజెక్టు మత్తడి తెగింది. విషయం తెలుసుకున్న ఆయన కలెక్టర్ గోపి, సీపీ ఎల్ సుబ్బారాయుడు, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన ప్రాజెక్టును శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వల ప్రాజెక్టు కేశవపట్నం, వీణవంక మండలాల రైతులకు వరప్రదాయినగా ఉందని, భారీగా కురిసిన వర్షాలకు వచ్చిన వరద నీటితో ఈ ప్రాజెక్టు మత్తడి తెగిపోవడం బాధాకరమని అన్నారు. ఈ ప్రమాదం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడంతో మత్య్సకార్మికులకు కూడా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు సుమారుగా 422 కిలోమీటర్లకు దూరం నుండి హుస్నాబాద్, సైదాపూర్, కేశవపట్నం మండలాల నుండి వచ్చే వరద నీటితో 2245 క్యూసెక్కుల నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం గల ప్రాజెక్టు సుమారు 2030 ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు. 20 మీటర్ల దూరం మత్తడి తెగిపోవడం జరగిందని, ఈ విషయాన్నిసీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దృష్టికి తనతో పాటు స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. కావున సీఎంతో పాటు మంత్రి ఈ ప్రాంత రైతులకు అండగా ఉంటామని చెప్పినట్లు తెలిపారు. ఈ సంఘటనపై తనతో పాటు స్థానిక ఎమ్మెల్యే రసమయి, వీణవంక, కేశవపట్నం మండలాల ప్రజాప్రతినిధులం ఎప్పటికప్పుడు ఆరా తీసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నప్పటికి ఎక్కువగా హుజురాబాద్ నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులకు ఉపయోగపడుతుందని, కావున ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి వెంటనే మరమ్మతులు చేయించి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను కోరారు. వీణవంక మండల కేంద్రంతో పాటు మల్లన్నపల్లి, రెడ్డపల్లి, బ్రాహ్మణపల్లి, రామకృష్ణాపూర్, పోతిరెడ్డిపల్లి, జమ్మికుంట మండలంలోని గోవిందపురం, రాయపల్లె, కాపులపల్లె తదితర గ్రామాల రైతులు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీవో హరిసింగ్, హుజురాబాద్ ఏసీపీ ఎల్ జీవన్ రెడ్డి, తహసీల్దార్ దండిగ రాజయ్య, హుజురాబాద్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు లక్ష్మారెడ్డి, ఆసీఫ్, ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్, జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, సర్పంచులు భద్రయ్య, నీల కుమారస్వామి, గంగాడి సౌజన్య తిరుపతిరెడ్డి, ఆర్ఐ గోనెల రవీందర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.