గొండిభాష అభివృద్ధికి కృషి చేస్తాం

గొండిభాష అభివృద్ధికి కృషి చేస్తాం– కలెక్టర్‌ రాజర్షిషా
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
గొండిభాష అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. ఆదివారం తొడసం కైలాస్‌ గొండి భాషలో రచించిన పండోక్న మహాభారత్‌ కథ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. దీనికి కలెక్టర్‌ ముఖ్యఅథితిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ కళాకారిణి మర్సుకోల కళవతి మహాభారతంలో పాండవుల జననం గురించి గోండి భాషలో పాట రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజర్షిషా మాట్లాడుతూ భాషపై అభిమానంతో తొడసం కైలాస్‌ మహాభారతం గోండులకు తెలియజేలాని గోండి భాషలో రచించడం అభినందనీయమన్నారు. భాష అభివృద్దికి ఆర్థిక సాయం కావాలని నాయకులు, రచయిత కైలాస్‌ కోరారని అన్నారు. ఈ విషయన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు సహకారం అందిస్తానన్నారు. అదే విధంగా పునాది విద్య గట్టిగా ఉండాలంటే మాతృభాషలోనే బోధనలు జరాగాల్సిన అవసరం ఉందన్నారు. దానికోసం ప్రయాత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో తెలుగులో ఉన్న కూడా టీచర్లు గోండి భాషలోనే బోధనలు చేస్తున్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులు అధికంగా రక్తహీనతతో బాదపడుతున్నారని దీనిపై అవగాహన కల్పించి, పౌష్టికాహారం తీసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్‌ నాయకులు ఆత్రం సుగుణ, మహిళ కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరీ బాయి, రచయిత మేస్రం మనోహర్‌, తొడసం చందు, గొండి, కొలాం, తోటి తెగల నాయకులు పాల్గొన్నారు.