చక్కెర్త ఫ్యాక్టరీని తెరిపించే దిశగా పనిచేస్తాం

– రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లాలో చక్కెర పరిశ్రమ తిరిగి ప్రారంభమయ్యేలా కృషి చేస్తామని రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ హామీ ఇచారు. సారంగాపూర్ లోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన రైతు సదస్సులో గడుగు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని, ఏడాది కాలంలో వ్యవసాయానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రైతు రుణమాఫీ, సన్నాలకు బోనస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాలు రైతులకోసమే తెచ్చినవని, చెరుకు రైతులకోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. గతంలో ఓ వెలుగు వెలిగిన చెక్కర ఫ్యాక్టరీ బిఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురై మూతపడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి రైతు కమిషన్ చైర్మన్ సభ్యులంతా కలిసి తీసుకెళ్తామన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలను కూడా సీఎం పై ఒత్తిడి తెచ్చేలా చేసి చెక్కర ఫ్యాక్టరీ తిరిగి మొదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సదస్సులో చెరకు రైతులు, రైతు సంఘాల నేతలు హాజరై వారి సమస్యలు వివరించారు.