మస్తు కష్టపడ్డాం…వెలుగులు తెచ్చాం

తెలంగాణ విద్యుత్‌ విజయోత్సవంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ వెలుగులు విరజిమ్మించడం కోసం విద్యుత్‌ ఉద్యోగులు చాలా కష్టపడ్డారనీ, దాని ఫలితాలను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి అన్నారు. సోమవారం నాడిక్కడి సంస్థ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ విద్యుత్‌ విజయోత్సవ సంబురాలు ఆయన అధ్యక్షతన ఘనంగా జరిగాయి. గౌరవ ముఖ్య అతిధులుగా ట్రాన్స్‌కో అండ్‌ జెన్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, ఖైరతాబాద్‌ నియోజకవర్గ శాసన సభ్యులు దానం నాగేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భముగా రఘుమారెడ్డి మాట్లాడుతూ గడచిన తొమ్మిదేండ్లలో సంస్థ పరిధిలో పంపిణి వ్యవస్థను మెరుగుపర్చడం కోసం రూ.14,063 కోట్లు ఖర్చుచేసినట్టు తెలిపారు. అన్ని రంగాల వారికీ నిరంతర నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందిస్తున్నామన్నారు. సంస్థలో పని చేసే ప్రతి ఉద్యోగి వినియోగదారుల సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని చెప్పారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశా నిర్దేశం ఫలితంగా అన్ని రంగాల వారికీ నిరంతర విద్యుత్‌ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్‌ ఉద్యోగుల కృషిని కొనియాడారు. సీఎండీ డీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ తొమ్మిదేండ్లలో విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థల పటిష్టత కోసం రూ.97,321 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ విజయం వెనుక ప్రతి విద్యుత్‌ ఉద్యోగి కషి, పట్టుదల ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి శ్రీనివాస్‌, జె శ్రీనివాస్‌ రెడ్డి, కె రాములు, జి పర్వతం, సీహెచ్‌ మదన్‌మోహన్‌రావు, ఎస్‌ స్వామిరెడ్డి, పి నరసింహ రావు, జి గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.