రోజురోజుకూ బలహీనపడుతున్న

రోజురోజుకూ బలహీనపడుతున్నఉక్రెయిన్‌ – మస్క్‌
రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధంలో ఉక్రెయిన్‌ ఓటమి పాలవుతుందని, భవిష్యత్తులో జరగబోయే శాంతి చర్చలలో ఉక్రెయిన్‌ పరిస్థితి మరింతగా బలహీనపడుతుందని ఎలన్‌ మస్క్‌ ఒక ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌) ప్రకటనలో పేర్కొన్నాడు. అమెరికాలోని ఉక్రెయిన్‌ మద్దతుదారుల్లో ఆందోళన పెరుగుతోందని, ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు ఉక్రెయిన్‌కు సహాయం అందించటానికి ఉద్దేశింపబడిన 60బిలియన్ల సహాయ బిల్లును అడ్డుకుంటున్న విషయం తెలిసిందేనని మస్క్‌ సోమవారం ఒక ఎక్స్‌ కామెంట్‌లో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ”చాలామంది దష్టిలో ఇదే ఉక్రెయిన్‌ అందుకోబోయే ఆఖరి పెద్ద సహాయం. అందుకోసం ఉక్రెయిన్‌ ఏమైనా చేస్తుంది ”అని తన పే పాల్‌ మిత్రుడు డేవిడ్‌ శాక్స్‌తో మాట్లాడుతూ మస్క్‌ అన్నాడు.
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు ఇదే తగిన సమయమనీ, ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ ఓడిపోయిందనీ, ఈ వాస్తవాన్ని మార్చలేమని కూడా ఫైనాన్షియల్‌, జనరల్‌ వార్తలపై స్పందించే ఒక పాపులర్‌ వాల్‌ స్ట్రీట్‌ సిల్వర్‌ అకౌంట్‌ తన స్పందనలో పేర్కొంది. అంతేకాక ఒకవేళ అమెరికా సహాయం అందినా యుద్ధంలో పరిస్థితి ఉక్రెయిన్‌కు అనుకూలంగా మారజాలదని కూడా ఆ స్పందన ఊహిస్తోంది. ”ఈ వాస్తవాన్ని గుర్తించటానికి ముందు ఎంతమంది చనిపోవాలి అన్నదే మిగిలిన ప్రశ్న” అని పైస్పందనతో ఏకీభవిస్తూ మస్క్‌ ప్రకటించాడు. ఒక సంవత్సరం క్రితమే శాంతి ఒప్పందం జరిగి వుండాల్సిందని, అప్పటి నుంచి వేలాది యువ సైనికులు చనిపోయారని, ఉక్రెయిన్‌ పరిస్థితి రోజురోజుకూ మరింతగా బలహీనపడుతోందని కూడా మస్క్‌ అన్నాడు.
2022లో ఇరు దేశాల మధ్య సాయుధ సంఘర్షణ మొదలైన తరువాత కొద్ది రోజులకే రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందం దాదాపు కుదిరింది. అయితే అంతిమంగా పశ్చిమ దేశాలిచ్చిన భరోసాతో ఉక్రెయిన్‌ సదరు శాంతి ఒప్పంద ముసాయిదాను తిరస్కరించి రష్యాను ఓడించటమే తమ లక్ష్యం అని ప్రకటించింది. అమెరికా
నిర్ద్వందంగా ఉక్రెయిన్‌కు అండగా వుంటుందని అప్పటి బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్‌సన్‌ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరాన్ని దర్శించి మరీ ఇచ్చిన వాగ్దానం వల్లనే రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయని ఉక్రెయిన్‌ తరపున చర్చలలో పాల్గొన్న డేవిడ్‌ అరఖామియా గత సంవత్సరం అంగీకరించాడు. ఉక్రెయిన్‌ యుద్ధం ” ఎలా మొదలయింది, ఎలా నడుస్తోంది, ఎలా ముగియగలదు” అనే విషయాలన్నీ ”అబద్దాల హౌరు”లో మునిగి తేలుతున్నాయనే శాక్స్‌ వాదనతో మస్క్‌ అంగీకరించాడు.