– 81 శాతం మంది కోటీశ్వరులే
– సగటు ఆస్తుల విలువ రూ.10.5 కోట్లకు పైగానే..!
– బీజేపీ నుంచే అధికం : ఏడీఆర్ నివేదిక
భోపాల్ : బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఒక సగటు మనిషి నెలవారీ ఆదాయం రూ.11 వేలు మాత్రమే. కానీ, అక్కడి ఎమ్మెల్యేల ఆస్థులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అసెంబ్లీలో అధిక సంఖ్యలో సంపన్నులు ఉన్నారు. దాదాపు 81 శాతం మంది కోటీశ్వరులే. అంటే 230 మంది సభ్యులను కలిగి ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 186 మంది ధనికులే కావటం గమనార్హం. ఇందులో అధికారిక బీజేపీ నుంచే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సమర్పించిన సభ్యుల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
భారీగా పెరిగిన ఆస్తులు
ఈ నివేదిక సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యేల సగటు ఆస్థుల విలువ రూ. 10.76 కోట్లుగా ఉన్నది. 2013లో ఒక ఎమ్మెల్యే సగటు ఆస్థి విలువ ఇది రూ.5.24 కోట్లుగా ఉండగా.. అది ప్రస్తుతం ఏకంగా 105 శాతం పెరగటం గమనార్హం. 2008లో మాత్రం సగటు మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే ఆస్థి విలువ రూ.1.44 కోట్లుగా ఉన్నది.
బీజేపీ ఎమ్మెల్యే సంజరు పాథక్ అత్యంత సంపన్నుడు
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మధ్యప్రదేశ్ శాసన సభలో అత్యంత సంప న్నుడిగా ఉన్నాడు. ప్రస్తుం ఈయన ఆస్తుల విలువ రూ.226 కోట్లుగా ఉన్నది. 2013లో ఆయన ఆస్తుల విలువ రూ.141 కోట్లుగా ఉండగా.. 2018 ఎన్నికల నాటికి 60 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేయటం గమనార్హం.
కమల్‌నాథ్ ఆరోస్థానం..
ఇక మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. ధనిక ఎమ్మెల్యేల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 124 కోట్లుగా ఉన్నది. ఇక ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆస్తుల విలువ రూ .7 కోట్లుగా ఉన్నది.
పేద ఎమ్మెల్యేలు వీరే..
మధ్యప్రదేశ్‌లో పేద ఎమ్మెల్యేల జాబితాలో ఆరుగురు బీజేపీ నుంచి, నలుగురు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. పంధానా స్థానం నుంచి తొలిసారి విజయం సాధించిన గిరిజన ఎమ్మెల్యే రామ్ డంగోర్ రూ.50వేల ఆస్తులను కలిగి ఉండి రాష్ట్రంలో అత్యంత పేద ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి ఉషా ఠాకూర్(రూ.7 లక్షలు), షరద్ కోల్ (రూ.8.4 లక్షలు) ఉన్నారు.
విద్యార్హతలు ఇలా..
230 మంది ఎమ్మెల్యేల్లో 59 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు (బీజేపీ నుంచి 35 మంది, కాంగ్రెస్ నుంచి 24 మంది) ఉన్నారు. ఇక 55 మంది ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్లు (బీజేపీ-28, కాంగ్రెస్ -26), 39 మంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లు (బీజేపీ-25, కాంగ్రెస్ 13 మంది) ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు డాక్టరేట్లు (బీజేపీ-4, కాంగ్రెస్-1) కాగా, నలుగురు ప్రొఫెషనల్ డిప్లోమా హౌల్డర్లు( బీజేపీ -2, కాంగ్రెస్ -1, స్వతంత్రులు -1 ) ఉన్నారు. 35 మంది ఎమ్మెల్యేలు 12వ తరగతి, 12 మంది ఎమ్మెల్యేలు 10వ తరగతి, ఏడుగురు 8వ తరగతి, 8 మంది 5వ తరగతి వరకు తమ విద్యార్హతను కలిగి ఉన్నారు. ఐదుగురికి చదవటం, రాయటం రాగా.. ఒక బీజేపీ ఎమ్మెల్యే మాత్రం నిరక్షరాస్యులుగా ఉన్నారు.
బీజేపీ నుంచి 107 మంది..
కాంగ్రెస్ నుంచి 76 మంది
ఇక ప్రస్తుత 81 శాతం మంది ధనిక ఎమ్మెల్యేల్లో అధికం అధికార బీజేపీ సభ్యులే కావటం గమనార్హం. రాష్ట్రంలో బీజేపీ మొత్తం 230 స్థానాలకు గానూ 129 ఎమ్మెల్యేలను కలిగి ఉన్నది. ఇందులో 107 మంది (83 శాతం మంది) కోటీశ్వరులే. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ 97 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. అయితే, వీరిలో 76 మంది (అంటే 78 శాతం మంది) సంపన్నులే కావటం గమనార్హం. ఇక నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ముగ్గురు సైతం కోటీశ్వరులే.2008 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంపన్న ఎమ్మెల్యేల సంఖ్య 84గానే ఉన్నది. 2013 అసెంబ్లీ ఎన్నికల నాటికి అది 92 శాతం పెరిగి 161కి చేరుకున్నది. 2018 నాటికి వచ్చేసరికి ధనిక ఎమ్మెల్యేల సంఖ్య 15.5 శాతం పెరిగి ఆ సంఖ్య 186గా నమోదైంది.
40 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
ఆస్తుల సంపాదనే కాదు.. క్రిమినల్ కేసుల విషయంలోనూ మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు.
ఇక్కడ మొత్తం 40 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 20 శాతం మందిపై తీవ్రమైన నేరపూరిత కేసులు ఉండటం గమనార్హం. అధికార బీజేపీ నుంచే 30 శాతం మంది క్రిమినల్ కేసులను కలిగి ఉండగా.. 16 శాతం మందిపై తీవ్రమైన నేరపూరిత కేసులు ఉన్నాయి.
ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి 54 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. 26 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.