మధ్య ప్రాచ్యంలో ఆయుధ మోహరింపు!

మధ్య ప్రాచ్యంలో ఆయుధ మోహరింపు!ఇజ్రాయిల్‌ దాని దుర్మార్గాలకు నిస్సిగ్గుగా వత్తాసు పలకటమే కాదు, సాయుధ రక్షణకు నౌకా, వైమానిక దళాలను రప్పిస్తూ ఆయుధాలను తరలిస్తున్న అమెరికా చర్యలతో మధ్య ప్రాచ్యంలో ఎప్పుడైనా ప్రాంతీయయుద్ధం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది.ఈ దుష్ట కూటమిని ఎదుర్కొనేందుకు ఇరాన్‌ దానికి మద్దతుగా ఉన్న సాయుధశక్తులు కూడా సిద్ధంగాక తప్పని స్థితి. హమాస్‌ నేత హనీయేను ఇరాన్‌ గడ్డమీద, హిజబుల్లా కమాండర్‌ ఫాద్‌ షుకుర్‌ను లెబనాన్‌లో హత్య కావించటం రెచ్చగొట్టే కుట్రలో భాగం తప్ప మరొకటి కాదు. దానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌, హిజబుల్లా ప్రకటించింది. తమ మీద దాడి చేసి పౌరులను హతమార్చిన హమాస్‌ సాయుధులను అణచివేసి కొద్ది గంటల్లోనే బంధీలుగా ఉన్న తమవారిని విడిపించుకు పోతామని ఇజ్రాయిల్‌ ప్రకటించి పది నెలలు దాటింది. రోజు రోజుకూ ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలలో తలదాచుకుంటున్న నిరాయుధుల మీద మారణ కాండ సాగించటం తప్ప హమాస్‌ సాయుధులను పట్టుకున్న జాడలేదు. ‘ఒక వీరుడు మరణిస్తే ఉద్బవింతురు వేయిమంది’ అన్నట్లుగా కొంత మంది హమాస్‌ నేతలను హతమార్చినా నాయకులు పుట్టుకువస్తూనే ఉన్నారు.
హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రకటించినప్పటి నుంచి మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం ప్రాంతాల్లోకి అమెరికా విమానవాహక యుద్ధ నౌకలు, ఖండాంతర క్షిపణులను ప్రయోగించే ఆధునిక యుద్ధనౌకలు, ఫైటర్‌ జెట్లను పెద్దఎత్తున తరలిస్తున్నది. అందువలన ఇరాన్‌ కూడా తన జాగ్రత్తల్లో తానుంది. రక్షణరంగంతో సహా గతంలో రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఆయుధాలు, రక్షణ వ్యవస్థలను దిగుమతి చేసుకుంటున్నది. గతంలో ఇరాన్‌కు అందచేసిన రక్షణ వ్యవస్థలను ఇజ్రాయిల్‌ వమ్ము చేసిందని, మరోసారి వాటిని ఇచ్చి ఎందుకు పరువును ఫణంగా పెట్టుకుంటారంటూ పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు కొందరు రష్యా మంచిని కోరుకుంటున్నట్లు ఫోజు పెడుతున్నారు. పదినెలలైనా హమాస్‌ను పట్టుకోలేక పసిపిల్లల ను, మహిళల మీద ప్రతాపం చూపుతున్నారు. వారికి తానతందానా అంటు న్నారు సిగ్గులేదా, మానవత్త కబుర్లు చెబుతున్నారు, మీకేం పోయేకాలం వచ్చిందని అదే వ్యాఖ్యాతలు ఇజ్రాయిల్‌కు, అమెరికాకు ఎందుకు గడ్డిపెట్టటం లేదు.పాలస్తీనాపౌరుల న్యాయమైన డిమాండ్లకు గతంలో మద్దతిచ్చిన కొన్ని ఇరుగుపొరుగు దేశాలు మధ్యలో వదిలేసి అమెరికా చంకనెక్కి ఇజ్రాయిల్‌తో యుగళగీతాలు పాడుతున్నప్పటికీ మాతృభూమి కాంక్ష తగ్గలేదు.
యూదు దురహంకారులు, మిలిటరీ దాడుల మధ్య పుట్టి పెరుగుతున్న వారికి శాంతియుత పరిస్థితి అంటే ఎలా ఉంటుందో తెలియదంటే అతిశయోక్తి కాదు. ఆత్మగౌరవంతో మాతృభూమిలో బతకటమా లేక వీరమరణం పొందటమా అన్నదే తప్ప వారికి మరొకటి తెలియదు. గాజాలో తమ పిల్లలు, మహిళలను హతమారుస్తున్నా, నివాసాలను నేలమట్టం గావిస్తున్నా వెన్ను చూపటం లేదు, వెనక్కు తగ్గటం లేదు.తమ నేతలు కొందరిని దొంగదెబ్బతీసి చంపినా పిరికిబారటం లేదు.
పాలస్తీనా మహత్తర లక్ష్యం కోసం పోరాడుతున్నవారికి మద్దతుగా ఉన్న ఇరాన్‌ మీద, దానికి వెన్నుదన్నుగా ఉంటున్న రష్యా మీద పశ్చిమదేశాలు ఏదో ఒకసాకుతో ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ అవి వెంట్రుకతో సమానమన్నట్లుగా ఆ దేశాల నేతలు ముందుకు పోతున్నారు. అమెరికా, ఇజ్రాయిల్‌ దగ్గర ఆధునిక ఆయుధాలు ఉండవచ్చు. గాజాలో హమాస్‌ దాదాపు ఆరువందల కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వుతున్నా, నలభైవేల మంది విముక్తి యోధులను తయారు చేస్తున్నా పసిగట్టలేకపోయారు. ఆ సొరంగాల్లో బందీలుగా ఉన్న తమ వారి ఆచూకీ కనుగొనేందుకు అవేమీ పనికిరాలేదు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు వస్తాడు. గాజా, లెబనాన్‌, ఎమెన్‌ వైపుల నుంచి ఒకేసారి పాలస్తీనా మద్దతుదారులు దాడులకు దిగితే తమ పరిస్థితి ఏమిటని ఇజ్రాయిల్‌ సాధారణ పౌరులు కూడా నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నారు. దానికి నెతన్యాహు ఆ నరరూపరాక్షసుడికి మద్దతు ఇస్తూ కొట్టండి, చంపండి అంటున్న జో బైడెన్‌ వంటి అపరమానవతావాదులు తప్ప మరొకరు కాదు. అందువలన ఇజ్రాయిలీలు కూడా తమ మిలిటరీ జరుపుతున్న దారుణాలను ఖండించాల్సిన అవసరం ఉంది. మధ్య ప్రాచ్యంలో మంటలు చెలరేగితే వాటికి వారూ మాడి మసికావాల్సిందేనని గుర్తించటం అవసరం.