– విక్రయించిన ప్రభుత్వ రంగ కంపెనీ బీఈఎల్
– బయటపెట్టిన జస్టిస్ ఫర్ మయన్మార్ సంస్థ
న్యూఢిల్లీ : మన దేశానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) గత ఆరు నెలల కాలంలో మయన్మార్ సైన్యానికి యాభై లక్షల డాలర్ల విలువైన ఆయుధాలు, సైనిక వినియోగ వస్తువులను విక్రయించింది. మయన్మార్ సైనికుల వినియోగం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాంకేతిక పరమైన పత్రాలను కూడా అమ్మింది. జస్టిస్ ఫర్ మయన్మార్ (జేఎఫ్‌ఎం) సంస్థ జరిపిన విచారణలో ఈ విషయం బయటపడింది. గత ఏడాది నవంబర్, ఈ సంవత్సరం ఏప్రిల్ మధ్యకాలంలో ఈ అమ్మకాలు జరిగాయి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని బీఈఎల్ సంస్థ మయన్మార్ సైనికులకు ఆయుధాలు, సామగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని విక్రయించిందని జేఎఫ్‌ఎం సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఏడు నౌకల ద్వారా మయన్మార్‌కు సరఫరాలు జరిగాయని, వీటిలో మూడు నౌకలను నేరుగా మయన్మార్ సైన్యానికి పంపారని, మూడు నౌకలను ఆయుధ బ్రోకర్ మెగా హిల్ జనరల్ ట్రేడింగ్‌కు పంపారని, ఒక నౌకను అలియన్స్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థకు పంపారని వివరించింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకా కార్యకలాపాల సమాచారం కలిగిన పుంజివా కంపెనీ నుండి ఈ వివరాలు సేకరించామని చెప్పింది. ‘బీఈఎల్‌కు మయన్మార్‌లో బ్రాంచ్ ఉంది. దాని ద్వారా మయన్మార్ సైన్యానికి ఆయుధాల సరఫరా జరిగింది. ఆ ఆయుధాలతో సైన్యం నేరాలకు, దారుణాలకు పాల్పడుతోంది’ అని ఆ సంస్థ వివరించింది. అంతర్జాతీయ నేరాలకు పాల్పడుతున్న మయన్మార్ సైన్యానికి భారత ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని, మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మానవ హక్కులు, మానవతావాద చట్టాల పరిధిలో నెరవేర్చాల్సిన తన కర్తవ్యాలను భారత్ విస్మరిస్తోందని, వాసెనార్ ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని విమర్శించింది. 2021 జులైలో కూడా బీఈఎల్ సంస్థ మయన్మార్‌కు సైనిక సామగ్రి సరఫరా చేసిందని మరో విచారణలో జేఎఫ్‌ఎం బయటపెట్టింది. బీఈఎల్‌లో కేంద్రానికి 51.14% వాటా ఉంది. ఇందులో మరికొన్ని ప్రముఖ సంస్థలకు కూడా వాటాలు ఉన్నాయి. మయన్మార్ సైనికులకు బీఈఎల్ సంస్థ ఆయుధాలు విక్రయిస్తున్న నేపథ్యంలో సంస్థాగత మదుపరులు దాని నుంచి బయటకు రావాలని జేఎఫ్‌ఎం డిమాండ్ చేసింది. సైనికులకు ఆయుధాలు సరఫరా చేస్తూ లాభాలు సంపాదిస్తున్న భారత ప్రభుత్వం, ప్రభుత్వ రంగంలోని ఆయుధ కంపెనీలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయని జేఎఫ్‌ఎం ప్రతినిధి యదనార్ మాంగ్ చెప్పారు. ‘మయన్మార్‌కు ఆయుధాలు, ఆయుధ సామగ్రిని విక్రయించడం ద్వారా ఆ దేశ పౌరుల ఆక్రందనలను, చట్టబద్ధంగా నడుస్తున్న నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని, పౌర సమాజాన్ని, ఐరాస తీర్మానాలను, అంతర్జాతీయ చట్టాల ప్రకారం తన బాధ్యతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం భావిస్తోంది. మయన్మార్ సైన్యానికి ఆయుధాల సరఫరాను నిలిపివేసేలా మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భారతదేశ మిత్రులు, భాగస్వాములు విఫలమయ్యారు’ అని మాంగ్ తెలిపారు. మయన్మార్ సైన్యానికి ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐదు ప్రముఖ దేశాలలో భారత్ కూడా ఒకటి. భారత సంస్థల నుండి 5.1 కోట్ల డాలర్ల విలువ కలిగిన ఆయుధాలు, ఆయుధ సామగ్రి, ముడి పదార్థాలు, ఆయుధ తయారీకి ఉపయోగించే పదార్థాలు సరఫరా అయ్యాయని అంచనా. బీఈఎల్‌తో పాటు భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ కూడా మయన్మార్ సైనికులకు ఆయుధాలు విక్రయించింది. మొత్తంమీద 22 మంది సరఫరాదారులు మయన్మార్ సైన్యానికి ఆయుధాలు పంపారు. అయితే మన దేశం మయన్మార్‌కు ఆయుధాలు విక్రయించే ప్రధాన వనరు కాదని, గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారమే అమ్మకాలు జరుగుతున్నాయని భారత ప్రతినిధి ఒకరు చెప్పారు. మయన్మార్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు.