– గుడ్డ ఉత్పత్తికి ఆర్డర్లు కల్పించాలని డిమాండ్
-14 వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష
– నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేసిన తహసీల్దార్
నవతెలంగాణ – గంగాధర
గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో బుధవారం నేతకార్మికులు మెాకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. పవర్ లూమ్స్ ను బంద్ చేసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీటీ చౌరస్తా నుండి నేతన్న విగ్రహం వరకు నేతకార్మికులు భారీ తీస్తూ పలు నినాదాలు చేశారు. వస్త్ర పరిశ్రమకు గుడ్డ ఉత్పత్తి ఆర్డర్లు అందించాలని, నేతకార్మికులకు పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నేతకార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 14 రోజులకు చేరింది. అయితే రిలే నిరాహార దీక్షలు నిరాటంకంగా కొనసాగిస్తూ వినూత్న కార్యక్రమాలతో నిరసనలు ఉధృతం చేశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రోజుకో విధమైన వినూత్న నిరసనతో ముందుకు సాగుతున్న విషయం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి చేరింది. నేతకార్మికుల ఇబ్బందులను, గుడ్డ ఉత్పత్తికి ఆర్డర్ కల్పించేలా చొరవ తీసుకుంటానని, దీక్ష విరమణ చేయాలంటూ సూచించారు.ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాలతో తహసీల్దార్ అనుపమరావు దీక్షా శిబిరాన్ని సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. గుడ్డ ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వాలని, పనులు కల్పించాలని నేతకార్మికులు తహసీల్దార్ కు వినతి పత్రం అందించి సమస్య తీవ్రతను వివరించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వివరిస్తూ తహసీల్దార్ నేతకార్మికులు, యజమానులకు నిమ్మరసం అందించి 14 రోజులుగా చేపట్టిన దీక్షను విరమింపజేశారు. పవర్ లూమ్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 14 రోజులు రిలే నిరాహార దీక్ష కొనసాగగా, చివరి రోజు మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి చిందం రాజమౌళి, గౌరవ అధ్యక్షుడు లచ్చయ్య, మండల నాయకులు బొలబత్తిని నర్సయ్య, మల్లేశ్ దీక్ష, ర్యాలీలో పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం నారాయణ, వస్త్రోత్పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అలువాల విఠోభ, ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చిందం సత్యనారాయణ, గుండా రాజేశం, మాజీ సర్పంచ్ కముటం రాజమల్లయ్య, సంఘం నాయకులు వెంకటాద్రి, తిరుపతి, చంద్రశేఖర్, శ్రీనివాస్, నగేశ్, శంకర్, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.