
నవతెలంగాణ – గంగాధర
పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమలకు ప్రభుత్వం వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందించి కార్మికులకు పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో గురువారం నుండి పవర్ లూమ్స్ కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తర్వాత స్థానాన్ని ఆక్రమించిన గ్రామంలోని పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమ గత ఎనిమిది మాసాలుగా వస్త్రోత్పత్తులు నిలిచి పనులు లేక కార్మికులు అవస్థ పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కల్పించిన బతుకమ్మ ఆర్డర్లు నిలిచి పోయాయి. దీంతో గ్రామంలో గుడ్డ ఉత్పత్తులు నిలిచిపోగా, గ్రామంలో తయారు చేసే చీరలకు మార్కెట్ లో డిమాండ్ లేదు. పవర్ లూమ్స్ యజమానులు చేసేది లేక వస్త్ర ఉత్పత్తులు నిలిపివేయగా, సాంచలనే నమ్ముకుని జీవనోపాధి పొందే పవర్ లూమ్స్ కార్మికులు వీధిన పడి ఆందోళన చెందుతున్నారు. పొద్దంత పని చేస్తేనే తాను, తన కుటుంబం బతుకుతుంటే, 8 నెలలుగా పనులు లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని వస్త్ర పరిశ్రమలకు ప్రభుత్వపరంగా గుడ్డ ఉత్పత్తులకు ఆర్డర్లు అందించి తమకు పనులు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. గత పదేళ్ల కింద నేతన్నల ఆత్మహత్యలు, ఆకలిచావులు మళ్లీ పునావృతం కాకముందే గర్శకుర్తి వస్త్ర పరిశ్రమలకు ప్రభుత్వం గుడ్డ ఉత్పత్తి కల్పించి ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. గ్రామ కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం నారాయణ ఆధ్వర్యంలో పవర్ లూమ్స్ కార్మికులు రిలే నిరాహార దీక్ష పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.