మాయావాదాన్ని అల్లుతున్నారు

మాయావాదాన్ని అల్లుతున్నారుప్రధాని నరేంద్ర మోడీ, ‘సనాతన ధర్మానికి’ తన మద్దతును బహిరంగంగా ప్రకటించినప్పుడే అసలు గుట్టు బయటపడింది. సామాజిక న్యాయాన్ని, సమానత్వ భావనను ‘సనాతన ధర్మం’ తిరస్కరిస్తుందని ఉదయనిధి స్టాలిన్‌ గతేడాది సెప్టెంబరులో చాలా పదునైన, విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసినప్పుడు, మోడీ ఆ సనాతన ధర్మాన్ని గట్టిగా సమర్థించారు. ‘సనాతన ధర్మ’ వినాశనమే లక్ష్యంగా ఓ రహస్య ఎజెండా నడుస్తోం దంటూ తమ వ్యతిరేకులను తీవ్రంగా నిందించారు. ‘సనాతన ధర్మ’ విరోధులపై ఎదురుదాడి చేయడానికి హిందూత్వ ప్రచారదళంలో భాగస్వాములయ్యేలా మంత్రుల్ని, తన పార్టీ సభ్యుల్ని సైతం పురిగొల్పారు. ఒకవైపు సామాజిక న్యాయం కోసం, దళితుల గౌరవ ప్రతిష్టల కోసం తాను కట్టుబడి వున్నట్టు పదే పదే మోడీ చేస్తున్న ప్రకటనలు బూటకమని, అంబేద్కర్‌పై ఆయన కురిపిస్తున్న ప్రశంసలు, సంత్‌ రవిదాస్‌ విగ్రహం పట్ల ఆయన చూపిస్తున్న భక్తి యావత్తూ ఒట్టి డొల్ల మాత్రమేనని మోడీ తాజా ప్రకటన తేటతెల్లం చేస్తోంది.
”భారత దేశాన్ని వేల ఏండ్ల పాటు ఐక్యంగా ఉంచిన ఆలోచనలు, విలువలు, సాంప్రదాయాలు అన్నీ కలిసి ‘సనాతన ధర్మం’గా ఉన్నట్టు మోడీ ప్రకటించారు. అయితే ‘ప్రాచీన’, ‘శాశ్వత’, ‘సార్వత్రిక సత్యాలు లేదా ధర్మాలు’ లాంటి అస్పష్టమైన పదాలను తప్ప, ‘సనాతన ధర్మం’ చెప్పే ఆలోచనలు, విలువలు, సాంప్రదాయాలు ఏమిటి అన్న సంగతిని మోడీగానీ, ఎదుటివారిని తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్న ఆయన అనుచరగణం గాని వివరించలేదు. ‘సనాతన ధర్మం’ యొక్క మౌలికమైన, ప్రత్యేకమైన ‘వర్ణ లేదా కుల వ్యవస్థ’ లక్షణాన్ని మరుగుపరచడం కోసమే ఏ వివరణా ఇవ్వలేదు.
అన్ని హంగులూ కలిగి వున్న అతగాడి సేనానులు తమ మాటల గారడీతో సనాతన ధర్మానికి కొమ్ము కాయడానికి తయారయ్యారు. లోకజ్ఞానం, మానవ విలువలు, వ్యక్తిగత విధులు, బాధ్యతలు, ప్రవర్తనా ప్రమాణాలు, నైతిక విలువలు లాంటి మాటల ముసుగులో దాని అసలు సారాంశాన్ని కప్పిపుచ్చుతున్నారు. ‘సనాతన ధర్మం’ యొక్క నిజ స్వభావాన్ని దాచిపెట్టడానికి దాని చుట్టూ ఆధ్యాత్మిక మాయావాదాన్ని అల్లుతున్నారు. దీనిని సద్గురు వాసుదేవ్‌ లాంటి ప్రముఖులిచ్చిన వివరణల్లో మనం చూడవచ్చు. ”ఈ సనాతన ధర్మం అనే ప్రక్రియ నీలో ప్రశ్నలు రేకెత్తించడం కోసమే ఉంది. ఆ ప్రశ్నల లోతుల్లోకి పోయి దీనంతటికీ మూలం ఏమిటో నువ్వే సహజంగా తెలుసుకుంటావు”. ఇలాంటి మరొక గురువు ‘సనాతన ధర్మం’ ”అందర్నీ ప్రేమించి, అందర్నీ కలుపుకొని పోతుందని” వ్యాఖ్యానించాడు. ఒకవేళ మనం ఈ వాదనలను ‘సనాతన ధర్మం’ యొక్క సారంగా అంగీకరించినా, ఇలాంటి శాశ్వతమైన సత్యాలే మనకు అన్ని మతాల్లోనూ కనిపిస్తాయి. కాని, అమానవీయ కుల, లింగ వివక్షతను ఎదుర్కొంటున్న దళితులు, ఇతర బలహీన కులాల వారి దైనందిన జీవితానుభవాల నుండి తలెత్తే ప్రశ్నలకు ఇట్లాంటి వాదనలు ఏ సమాధానాన్నీ ఇవ్వగల పరిస్థితి లేదు.
ఇంతకూ సనాతన ధర్మం ప్రత్యేకత ఏమిటి? ఏ మాత్రమూ సమర్థించుకోలేని స్థితిలో ఉన్న హిందూత్వ తత్వవేత్తలు తప్పించుకోవడానికి ఇచ్చే వివరణలు, వ్యక్తం చేసే ధర్మాగ్రహం మాట ఎలా వుందన్న దానితో నిమిత్తం లేకుండా వారు సనాతన ధర్మంలో ఉన్న శాశ్వత సత్యాన్ని కప్పిపుచ్చలేరు. కఠినమైన, అమానవీయ, వారసత్వ, పుట్టుక ఆధారిత, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను దాచిపెట్ట లేరు. అత్యంత నిరంకుశమైన, హానికరమైన ‘వర్ణాశ్రమ ధర్మం’ లేక ‘కుల ధర్మం’ కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశమంతా విస్తరించివున్న ఏకైక ముఖ్యమైన ఆలోచన, విలువ, సాంప్రదాయం అనే వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నట్టు భావించాలి. కాబట్టి మోడీ, సంఘ్‌ పరివార్‌ ప్రత్యేకమైన బుద్ధి మాంద్యంతో బాధపడుతున్నట్లు భావించాలి. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మ సూత్రాలు, గృహ్య సూత్రాలు (గృహస్తులు ఆచరించాల్సిన ధర్మాలు, సంస్కారాలు), పురాణాలు, భగవద్గీత అన్నీ వర్ణ లేదా కుల వ్యవస్థను సమర్థిస్తాయి. ఈ వాస్తవాన్ని వారు నిరాకరించగలరా? వర్ణ ధర్మం నుండి పక్కకు మళ్లు తున్నందుకు కఠినమైన శిక్షను విధించడమే కాక, వర్ణ ధర్మ పరిరక్షణ పాలకుల ప్రాథమికమైన బాధ్యత అని చెప్పే మనుస్మృతిని మనం పట్టించుకోకూడదని వారు కోరుకుంటున్నారా?
ఒకవేళ ‘కుల వ్యవస్థ వేరు, సనాతన ధర్మం వేరు’ అని కుల వ్యవస్థను బలపరిచే వాదనలతో విడగొట్టు కోవాలనుకుంటే, మోడీ ఆ విషయాన్ని ముందు స్పష్టం చేయాలి. ఆ తర్వాతనే తన వ్యతిరేకుల మీద విమర్శలకు పూనుకోవాలి. అది అతనికి కచ్చితంగా తెలియకుంటే శ్రేణీగత, వివక్షా పూరిత ‘వర్ణ లేదా కుల ధర్మం’ వారి పవిత్రమైన గ్రంథాల్లో భాగంగా ఉన్నాయా లేవా అనే విషయం పై వివరణ ఇమ్మనమని వారు సాధువుల్ని, మత ప్రచారకులని, శంకరాచార్యుల్ని వేడుకోవచ్చు. అయితే, మోడీ ఈ పనిచేస్తారని ఎలా ఆశించగలం? అలా అయితే అతని కపటత్వం బయటపడుతుంది కదా!
ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యల నుండి తలెత్తిన వివాదం హిందూత్వ దళం అసలు రంగును ప్రజల ముందు బయటపెట్టింది. మోడీ, ఆయన అనుచర గణం తాము 19వ శతాబ్దానికి చెందిన అభివృద్ధి నిరోధకులైన సనాతనవాదులకు నిజమైన వారసు లుగా మన ముందు నిల బడ్డారు. ఆ కాలంలో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజ్‌, ప్రార్థనా సమాజ్‌, రామకృష్ణ మిషన్‌ వంటి సంస్థలు హిందూ మతానికి అనేక సంస్క రణలు ప్రతిపాదించాయి. ఆ సంస్కరణలను వ్యతిరేకిస్తూ పలు ఛాందసవాద, సాంప్రదాయ హిందూ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఆ సంస్థల నాయకులే, ‘సనాతన ధర్మానికి’ ప్రాచుర్యం కల్పించారు. ‘హిందూ’ అనే పదం పర్షియన్‌ మూలాలు కలిగి ఉన్నందువల్ల ఈ ‘సనాతన వాద’ సేవా తత్పరులు ‘హిందూ’ పదాన్ని ఇష్టపడక, దానికి బదులుగా ‘సనాతన ధర్మం’ అనే పదానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరమైన విషయం.
(సనాతన ధర్మంపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఏప్రిల్‌లో రాసిన వ్యాసం పునర్ముద్రణ)
బి.వి.రాఘవులు