అన్ని పోలింగ్‌బూత్‌లలో వెబ్‌ కాస్టింగ్‌

అన్ని పోలింగ్‌బూత్‌లలో వెబ్‌ కాస్టింగ్‌– పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి
– హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌
– ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలి : హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఈనెల 13న పోలింగ్‌ నిర్వహణకు హైదరాబాద్‌ జిల్లాలో యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది.. అన్ని పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌ కాస్టింగ్‌ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. పోలింగ్‌ నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు అనుదిప్‌ దురిశెట్టి, హేమంత్‌ కేశవ్‌పాటిల్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నియోజకవర్గానికి 30 మంది అభ్యర్థులు, సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి 45 మంది అభ్యర్థులు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 45,91,201 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 23,38,857 మంది పురుషులు, 22,52,008 మంది మహిళలు, 336 మంది థర్డ్‌ జెండర్‌ అని వివరించారు. జిల్లాలో 3986 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌ కాస్టింగ్‌ చేస్తున్నట్టు చెప్పారు. 1250 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మైక్రో అబ్జర్వర్లుగా నియమించి శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో మహిళా పోలింగ్‌ అధికారిని కేటాయించామని తెలిపారు. పోలింగ్‌ శాతం పెరిగేలా పెద్దఎత్తున స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌కు 16,776 మంది దరఖాస్తు చేశారని, ఇప్పటివరకు 9,266 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. ఈనెల 8 నాటికి పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోలేని వారి కోసం మే 9, 10వ తేదీలలో కూడా ఫెసిలిటేషన్‌ సెంటర్లు తెరిచే ఉంచుతారని చెప్పారు. ఓటర్‌ సమాచారం స్లిప్పులను, ఓటర్‌ గైడ్‌ సమాచారం బుక్‌లెట్‌ను పంపిణీ చేయడంతోపాటు ఇంటింటికీ స్టిక్కర్‌ వేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.38,55,72,637, ఇతర విలువైన వస్తువులు, మద్యాన్ని పట్టుకుని సీజ్‌ చేసామని తెలిపారు. అందులో ఇప్పటివరకు డీజీసీ ద్వారా 4,12,03,655/- నగదు, ఇతర వస్తువులు విడుదల చేసినట్టు చెప్పారు. రూ.1,52,64,160/- నగదు, ఇతర వస్తువులకు ఆదాయపన్ను, కమర్షియల్‌ టాక్స్‌ శాఖలకు తదుపరి చర్యలకు పంపినట్టు చెప్పారు.
హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీఆర్‌సీ, స్ట్రాంగ్‌ రూమ్స్‌, కౌంటింగ్‌ సెంటర్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, మే 11న సాయంత్రం 5:00 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలు నిషేధమని తెలిపారు. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం పోలింగ్‌ తేదీ తెలిపే ఓటరు స్టిక్కర్‌, ఐ ఓట్‌ ఫర్‌ షూర్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అదనపు కమిషనర్‌ అలివేలు మంగతాయారు, హౌం ఓటింగ్‌ నోడల్‌ అధికారి డిప్యూటీ కలెక్టర్‌ అర్చన తదితరులు పాల్గొన్నారు.