వారాల ఆనంద్‌ జ్ఞాపకాల సడి

Weeks of memories of Anandగతాన్ని నెమరువేసుకోవడానికి కాస్తంత తెరపి అవసరం. మనోవేగంతో పోటీపడి సాగుతున్న ఆధునిక జీవనంలో తెరపి దొరకడం కాస్త కష్టమే. కారణాలేవైనా దొరికిన విశ్రాంతిని, కాలాన్ని సృజన వైపు మళ్ళించడం మంచి వ్యాపకం. అనారోగ్య కారణం వల్ల వారాల ఆనంద్‌కు విశ్రాంతి దొరికింది. గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకునే వెసులుబాటు కలిగింది. అది కాస్త జ్ఞాపకంగా విస్తరించి ”యాదోంకి బారాత్‌” అనే పుస్తకంగా వెలువడింది. ‘ఇప్పుడు రచనే నన్ను బతికిస్తుంది” అని చెప్పుకున్న ఆనంద్‌ కలం నుండి కవితలు, వ్యాసాలు, అనువాదాలు, ఆడియోటాక్స్‌, వీడియో విజువల్స్‌, రేడియో ప్రోగ్రామ్స్‌, సోషల్‌ మీడియా రైటింగ్స్‌ ఇలా రకరకాలుగా వెలువడినాయి. 1958 నుండి 2014 వరకు విస్తారంగా పరుచుకున్న తన జీవనానుభవాల్ని పొరలు పొరలుగా పాఠకుల ముందు పరిచారు. ఏ రచననైనా సమాజం నుండి వేరు చేసి చూడలేం. సామాజిక స్పృహ కలిగిన రచనలో సమకాలీన చరిత్ర రూపుకడుతుంది ఆనంద్‌ జీవితం. ఆనాటి ఘటనలతో కలగలిసి ఉండడం వల్ల జ్ఞాపకాలు చాలావరకు చరిత్రను గుర్తుచేస్తాయి.
ఆత్మకథ, జీవిత చరిత్ర, జ్ఞాపకాలు పేరేదైనా కానీయండి, ఆ రచనతో రచయిత లేదా వ్యక్తి జీవితం ముడివేసుకొని ఉంటుంది. సుఖదు:ఖాలను, మానావమానాలను సమదృష్టితో వ్యక్తం చేసిన రచనకు విశ్వసనీయత చేకూరుతుంది. రచయిత నిజాయితీకి ఇలాంటి రచనలు అద్దంపడతాయి. ”నాకు తెలిసి నేను మధ్య తరగతి జీవిని. పట్టణ వాసన ఉన్నవాణ్ణి. చాలా వాటిని ప్రేమించాను. అభిమానించాను. ఆరాదించాను. ప్రేరణ పొందాను. కానీ అందులోకి దిగలేదు. కాళ్ళకు మట్టి అంటలేదు, ఒంటికి సురుకూ అంటలేదు. కానీ నేను నా విశ్వాసాల్ని, ప్రేమల్ని, అభిమానాల్ని అట్లే ఉంచుకున్నాను. మారలేదు. నమ్మినదానికి ఎప్పుడూ వ్యతిరేకమయితే కాలేదు. శత్రువుగానయితే మారలేదు. బహుశ నేను నమ్మింది మానసావాచా అనుసరించింది ఇదే” అని చెప్పుకున్న ఆనంద్‌ మాటవల్ల రచనకు బలం చేకూరింది. 1958లో జన్మించిన రచయిత 2014లో పునర్జన్మించాడు. ఈ మధ్య కాలపు ఘటనలు, అనుభవాలు, అనుభూతులను జ్ఞాపకాల రూపంలో పంచిపెట్టాడు. కొందరికి జీవితం వడ్డించిన విస్తరయితే మరికొందరికది శూన్యహస్తం లాంటిది. ఇంకొందరికి ఎగుడుదిగుడు దారి లాంటిది. అలాంటి దారిలో పడుతూ లేస్తూ నిలిచిన రచయిత వారాల ఆనంద్‌. అందుకే ”జీవితంలో వ్యక్తిత్వం, ప్రతిభ రూపొందే క్రమం ఒకటి ఉంటుంది. గెలుపోటముల మధ్య అని కొనసాగుతుంది” అని అనగలిగాడు.
ఉమ్మడి కుటుంబంలో జన్మించిన రచయిత అవ్వాతాతల ఆప్యాయతను, చిన్నా పెద్దల ప్రేమను పొందాడు. ఉమ్మడిలో గల ఐక్యతను, అసూయలను అనుభవించాడు. హాస్టల్‌ను తలపించే చతుశ్శాల భవంతి గుంపు మనస్తత్వాన్ని ఆకళింపు చేసుకున్నాడు. మిఠాయి సత్తెవ్వ, డా|| సుబ్రమణ్యంల మనవడిగా పొందిన అనురాగాల్ని, పెద్దనాన్నల దౌర్జన్యాల్ని సమానంగా చవిచూసాడు. అర్ధరాత్రి అవమానకరంగా బయటకు గెంటివేయబడిన సంఘటన రచయిత బాల్యంపై బలమైన ముద్రవేసింది. ఇది ఉమ్మడి కుటుంబపు మరో పార్శ్వం. ఆ తరువాతనే రేడియో, సినిమా లాంటి వికాస సదుపాయాలు ఆనంద్‌కు అందాయి. వాటివల్లనే అతనిలో వికాసం మొగ్గ తొడిగింది. ఇతను పుట్టి పెరిగిన కరీంనగర్‌ ఊరు లక్షణాలు, పట్టణ పోకడలు కలగలిసిన కేంద్రం. మిఠాయి వ్యాపారం, సినిమా టాకీసులు, రోడ్లు, హోటల్స్‌ పట్టణ చిహ్నాలైతే, ఇండ్లు, బడులు, ఉమ్మడి కుటుంబాలు పల్లెపట్టుల ఆనవాళ్ళు. సెమీ అర్బన్‌ లక్షణమైన గుండాయిజం, వీధి పోరాటాలుగా వర్ధిల్లింది. ఒక వాడకు, మరొక వాడకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. వ్యక్తుల ఆధిపత్యాలకు అది ఆజ్యం పోసి బడి పిల్లలను, యువకులను సమూహాలుగా విడగొట్టి ఎదురెదురుగా నిలబెట్టింది. ఆనంద్‌ లాంటి తటస్థులను కూడా ఏదో ఒక వైపు నిలబెట్టిన కాలమది. హత్యలు, కేసులు, కొట్లాటలు-పరిష్కారాలు ఫ్యూడల్‌ చిహ్నాలుగా విలసిల్లాయి. పట్టణాల్లోని ఆ వాతావరణం నుండే ప్రగతిశీల శక్తులు తలెత్తి గ్రామాలకు తరలాయి. ఈ క్రమాన్నంతటినీ పుస్తకం చెప్పింది.
స్పష్టంగా మాట పలకలేని తనం వల్ల ఆనంద్‌ సమూహంలో ఒంటరిగా పెరిగాడు. సూటిపోటి మాటల వల్ల అంతర్ముఖుడయ్యాడు. అమ్మమ్మ ఒడిలో కొంత, రేడియో నీడన కొంత సేదతీరాడు. బినాకా గీత్‌ మాలా నారుపోస్తే, నవలలు నీరు పోసాయి. తద్వారా సృజన పంట సమాజానికందింది. పెరిగి పెద్దగయ్యే క్రమంలో గొంతు పెకలనితనం వల్ల వెనక బెంచికి పరిమితమైతే, అతనిలోని కార్యశీలి నలుగురిలో వెలిగాడు. కరీంనగర్‌లోని కార్ఖానగడ్డ, గంజ్‌ హైస్కూల్‌ మీదుగా సైన్స్‌ కాలేజీ వరకు ఎదిగిన తరువాత కళాశాల కార్యక్రమాల ఉదృతి, కొత్తస్నేహాల ప్రభావాలు, ప్రగతిశీల ఆలోచనలు పదుగురిలో మాట్లాడక తప్పనిసరి పరిస్థితులను కల్పించాయి. ఈ సందర్భంలోనే చిన్ననాటిస్నేహితులను, చదువు నేర్పిన పంతుళ్ళను, బడుల స్థితిగతులను, విద్యార్థుల చలనశీలతను పూసగుచ్చినట్లు వివరించాడు.
తను 60% మార్కులు అందుకోలేని సాధారణ విద్యార్థినని చాలా చోట్ల చెప్పుకున్నాడు. డిగ్రీ వరకు ఉన్న ఊళ్ళోనే చదువుకోవడం వల్ల తీరుబడి కాలాన్ని సాహిత్య, సాంస్కృతిక కార్యకలాపాలకు వెచ్చించాడు. తల్లిగారి ఊరైన వేములవాడలో ఎక్కువ కాలం ఉండటం వల్ల అక్కడి నటరాజకళానికేతన్‌, కళాభారతి లాంటి సంస్థల ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని అందుకున్నాడు. ఉత్తర తెలంగాణలోని వామపక్ష తీవ్రవాదం, ఎమర్జెన్సీ ప్రకటన, జగిత్యాల జైత్రయాత్ర, పౌరహక్కుల సంఘాల ప్రభావాలు ఆనాటి విద్యార్థులపై మెండుగా ఉన్నాయి. ఆ అవగాహనతోనే ఉస్మానియా యూనివర్శిటీలో లెఫ్ట్‌వింగ్‌కు మద్దతిచ్చి ఎన్నికల్లో వారిని గెలిపించాడు. యూనివర్శిటీ చదువు పూర్తి కాగానే మంథని జూనియర్‌ కళాశాలలో లైబ్రేరియన్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడినుండి మొదలైన ఉద్యోగ పర్వం కరీంనగర్‌లో ఎస్‌.ఆర్‌.ఆర్‌. డిగ్రీ కళాశాలతో ముగిసింది. ఈ మధ్యకాలంలో తనకు తారసిల్లిన సాహితీవేత్తలను, తనపై వారి ప్రభావాలను చెప్పుకున్నాడు. తన నిక్కచ్చితనం మూలంగా పరీక్ష, ఎన్నికల విధుల్లో ఎదురైన ప్రమాదాలను సీనియర్స్‌ సహాయంతో గట్టెక్కిన విధానాన్ని వివరించాడు.
ఒక వైపు ఉద్యోగం, మరొక వైపు తీరిక లేని కార్యక్రమాలలో జీవితం గడిపారు. కరీంనగర్‌ ఫిలిం సొసైటీ స్థాపన-భవన నిర్మాణము, ఫిలిం క్లబ్స్‌ ఏర్పాటు, ఫిలిం ప్రదర్శనలు, ఫిలిం ఫెస్టివల్స్‌ నిర్వహణ, అక్షర ఉజ్వల కార్యక్రమాలు, సాహితీ గౌతమి, తెలంగాణ రచయితల వేదిక లాంటి సాహితీ సంస్థల్లో భాగస్వామ్యం, కరీంనగర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ స్థాపన, పుస్తక ప్రచురణ, ప్రింట్‌-విజువల్‌ మీడియాతో తనకున్న అనుబంధాన్ని, చిన్న సినిమా నిర్మాణం, మొదలగు పనులలో పడిన కష్టాల్ని పాఠకులకు చేరవేశారు. ఇందులో ఆనాటి చరిత్ర కనపడుతుంది. కాలేజీ ఉద్యోగం-కార్యక్రమాలు, కరీంనగర్‌ ఫిలిం సొసైటీ ప్రదర్శనలు ఉత్సవాలు, సృజనాత్మక కృషి-డాక్యుమెంటరీ నిర్మాణం, కుటుంబ సమస్యలు అనే నాలుగు రంగాల్లో అంతా తానై వ్యవహరించారు. తన ఆరోగ్యం దెబ్బతినేంత వరకు మూడు సినిమాలు-ఆరు ఫిలిం ఫెస్టివల్స్‌, రెండు కవితలు-నాలుగు సంపుటాలుగా ప్రదర్శన సాగింది. 2014లో రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయి ఆనంద్‌ ఆరోగ్యం దెబ్బతింది. అది డయాలసిస్‌కు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దారితీసింది. ఆ కాలం నరకానికి నకలు లాంటిది. ఆయన సహచరి ఇందిర తన కిడ్నీని ఇచ్చి పునర్జన్మ ప్రసాదించింది.
రైటర్‌, జర్నలిస్టు, ఫిలిం మేకర్‌, ఆర్గనైజర్‌ లైబ్రేరియన్‌, డాక్యుమెంటరీ రైటర్‌, డైరెక్టర్‌ ఇలా బహుముఖాలుగా ఆనంద్‌ విస్తరించాడు. పురానీ ఫిల్మోంకే గీత్‌, ఆప్‌హీకే గీత్‌, బినాకాగీత్‌మాలా లాంటి హిందీ పాటల ప్రోగ్రాంలు ఆనంద్‌కు ఇష్టం. వాటి ప్రభావంతోనే పుస్తకానికి ”యాదోంకీ బారాత్‌” పేరు పెట్టాడు. బొమ్మల కొలువు, జాతర, పురుడు లాంటి విశేషాల్ని సంస్కృతి చిత్రణలో భాగంగా చిత్రిక పట్టాడు. యాదోంకీ బారాత్‌ అనేది రచయిత విడుదల చేసిన శ్వేతపత్రం. అది అతని జీవిత దర్పణం.

– డా|| బి.వి.ఎన్‌. స్వామి, 9247817732