– ఎంపీ అభ్యర్థుల విషయంలో బీఆర్‌ఎస్ వ్యూహం
– ‘అసెంబ్లీ’ అనుభవాలతో తొందరపాటు కూడదని నిర్ణయం
– పూర్తి స్థాయిలో చర్చించాకే అభ్యర్థుల ఖరారు
– ఎమ్మెల్సీ కవితకు ఈసారి అవకాశం లేనట్టే
– నిజామాబాద్ నుంచి సీనియర్ నేత బాజిరెడ్డికి ఛాన్స్…?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మూణ్నెల్ల ముందే 115 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్… ఇప్పుడు లోక్‌సభ ఎలక్షన్లకు మాత్రం అలాంటి ప్రయోగాల జోలికి పోవద్దని నిర్ణయించింది. సిట్టింగులను మారిస్తే అసెంబ్లీ ఫలితాలు మరోలా ఉండేవంటూ విశ్లేషణలు, రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడున్న సిట్టింగులను అలాగే ఉంచాలా..? లేక కొత్త వారిని ఖరారు చేయాలా..? అనే మీమాంసలో ఆ పార్టీ ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శాసనసభ ఎన్నికల్లో మాదిరిగా ఆర్భాటం, హడావుడి లేకుండా ‘ఆచి.. తూచి…’ వ్యవహరించాలని యోచిస్తోంది. మూడు ఎంపీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి, ప్రచారం చేసుకోవాలంటూ సూచించిన అధినేత కేసీఆర్, మిగతా వాటి విషయంలో మాత్రం ‘నిదానమే ప్రధానం…’ అనే సూత్రాన్ని పాటించాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ తమ వ్యక్తిగత పోకడలు, వ్యవహారశైలి వల్ల కేసీఆర్, కేటీఆర్‌కు అతి దగ్గరగా ఉన్న అనేక మంది యువ ఎమ్మెల్యేలు ఓటమిపాలైన సంగతి విదితమే. అందువల్ల ఎంపీ అభ్యర్థుల ఎంపికలో నేతల వ్యక్తిగత చరిత్ర, ప్రజలతో ఉన్న సంబంధాలు, క్యాడర్‌తో మమేకమవుతున్న విధానం, వీటితోపాటు ‘అంగబలం, అర్థబలా’న్ని ప్రామాణికంగా తీసుకోనున్నారు. వీటన్నింటినీ పరిశీలించాక సీనియర్లతో చర్చించి, మేధోమథనం చేసిన తర్వాతే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఖమ్మం, చేవెళ్ల ఎంపీ స్థానాలకు సిట్టింగులు నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, కరీంనగర్‌కు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులుగా ఖరారు చేసిన సంగతి విదితమే. కాగా నిజామాబాద్ స్థానం నుంచి మరోసారి పోటీ చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు. ఆ మేరకు ఆమె క్షేత్రస్థాయిలో కార్యాచరణను మొదలు పెట్టినట్టు తెలిసింది. కానీ ‘కుటుంబ పాలన’ అనే ముద్ర పార్టీపై పడిన నేపథ్యంలో ఈసారి కవితకు టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేకపోవచ్చని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు బదులుగా సీనియర్ నేత, ఆర్టీసీ మాజీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్‌ను బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నట్టు వినికిడి. పార్టీలో సీనియర్‌గా ఉండటమేగాక, పలుమార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన బాజిరెడ్డికి… వివాదరహితుడుగా, సౌమ్యుడిగా పేరుంది. ఆయన్ను నిలబెడితే పాజిటివ్ ఓటు పడటంతోపాటు మున్నురు కాపు సామాజిక వర్గానికి చెందిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు చెక్ పెట్టొచ్చని (బాజిరెడ్డి కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి) గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. దీంతోపాటు పెద్దపల్లి, మహబూబాబాద్ స్థానాల్లో సిట్టింగులను మారుస్తారనే చర్చ కొనసాగుతోంది. పెద్దపల్లి టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మహబూబాబాద్ సీటు కోసం మాజీ ఎంపీ సీతారాం నాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయితే సిట్టింగులను మారుస్తారనేది కేవలం ఉహాగానాలేననీ, ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని పలువురు బీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడ్డ్డారు.