హైకోర్టు న్యాయమూర్తికి ఘన స్వాగతం

నవతెలంగాణ – కంటేశ్వర్
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ ఎన్.తుకారాం శనివారం నిజామాబాద్ కు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లాకు కొత్తగా రెండు సివిల్ కోర్టులు మంజూరయ్యాయి. కొత్తగా ఏర్పాటైన అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి(అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి), ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జి(ఐదో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్) కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి ఎన్.తుకారాం జిల్లా కోర్టుల భవన సముదాయంలో ప్రారంభించారు. ముందుగా ఆయన స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా, జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు డీసీపీ జయరాం, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయ శాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి, కలెక్టర్, అదనపు కలెక్టర్లతో హైకోర్టు న్యాయమూర్తి అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.