– సిరాజ్‌కు జన నీరాజనం
– హైదరాబాద్‌లో భారీ ర్యాలీ
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రపంచ చాంపియన్, హైదరాబాదీ మియా భారు మహ్మద్ సిరాజ్‌కు తెలుగు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్ సాధించిన తొలిసారి హైదరాబాద్‌కు చేరుకున్న మహ్మద్ సిరాజ్‌కు నగరంలో అభిమానులు భారీ స్థాయిలో స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలోనే మొదలైన సందడి.. మెహిదిపట్నంలో భారీ ర్యాలీతో ముగిసింది. సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్న మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తరఫున సీఈవో సునీల్, రవి కుమార్‌లు పుష్పగుచ్చంతో స్వాగతించారు. మెహిదిపట్నంలోని సరోజిని కంటి ఆసుపత్రి నుంచి ఈద్గా గ్రౌండ్ వరకు మహ్మద్ సిరాజ్ విజయోత్సవ ర్యాలీ సాగింది. ‘బడే మియాన, హైదబాద్ పేస్ గన’ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీ20 ప్రపంచకప్ మెడల్, జాతీయ పతాకం పట్టుకుని సిరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. డీజే, బ్యాండ్, బాణాసంచా, అభిమానుల సందడితో మెహిదిపట్నం ప్రాంతం జన జాతరను తలపించింది. చాంపియన్ స్టార్‌కు స్వాగతం పలికిందుకు అభిమానులు, ప్రజలు రోడ్డుకు ఇరు వైపులా బారులుతీరారు. నగరం నలుమూలల నుంచి అభిమానులు రావటంతో ముందస్తు ఏర్పాట్లు చేయటంలో పోలీసుల విఫలం అయ్యారు!.