కళంకితులకు వెల్‌కం

Welcome to the tainted– కమలదళంలో చేరితే పునీతం.. అటకెక్కుతున్న కేసులు
– చేరగానే పార్టీ టిక్కెట్లు… స్టార్‌ క్యాంపెయినర్‌ హోదాలు
– దాడుల భయంతో కాషాయం నీడకు నాయకులు
అజిత్‌ పవార్‌, అశోక్‌ చవాన్‌, నవీన్‌ జిందాల్‌, గీతా కోడా…వీరందరూ నిన్న మొన్నటి వరకూ ప్రతిపక్ష నేతలు. ఇప్పుడు కమలనాథులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ఎదుర్కొన్న వారందరూ బీజేపీ పంచన చేరగానే పునీతులై పోయారు. కళంకిత నేతలకు బీజేపీ ‘వాషింగ్‌ మెషిన్‌’గా తయారైందని ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తూనే ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యల నుండి తప్పించుకోవడానికి వీరందరూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) నేత ప్రఫుల్‌ పటేల్‌పై ఉన్న అవినీతి కేసును సీబీఐ మూసేసింది. అక్రమ మైనింగ్‌ కుంభకోణంలో నిందితుడైన గాలి జనార్ధన రెడ్డి కమలదళంలో చేరిపోయారు. రేపో మాపో ఆయన కూడా సచ్చీలుడుగా బయటకు వస్తారు.
న్యూఢిల్లీ : కళంకిత నేతలను మీ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని రెండు రోజుల క్రితం ఓ పాత్రికేయుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించగా ‘పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి. అందరినీ ఆహ్వానిస్తాం’ అని బదులిచ్చారు. అనేక కేసులు ఉన్న వారిని కూడా మీ పార్టీ ఆహ్వానిస్తుందా అని ప్రశ్నిస్తే పార్టీ అందరికీ స్వాగతం పలుకుతోందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్లు, స్టార్‌ క్యాంపెయినర్‌ హోదా పొందిన కొందరు కళంకిత నేతల వివరాలు పరిశీలిస్తే…
అజిత్‌పై కేసును మూసేశారు
ప్రధాని నరేంద్ర మోడీ ఒకప్పుడు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)ని ‘నేచురల్లీ కరప్ట్‌ పార్టీ’ అని అభివర్ణించారు. అయితే ఆ పార్టీని చీల్చి, కొందరు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని బీజేపీలో చేరిన అజిత్‌ పవార్‌కు లోక్‌సభ ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్‌ హోదా కట్టబెట్టారు. పవార్‌పై రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో పలు దర్యాప్తు సంస్థలు అనేక కేసులు నమోదు చేశాయి. వీటిలో సహకార బ్యాంక్‌ కేసు, రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్ట్‌ కేసు సుమారు దశాబ్ద కాలంగా నలుగుతున్నాయి. ఎన్సీపీపై తిరుగుబాటు చేసిన అజిత్‌ పవార్‌ ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీతో ఆయన అలా చేతులు కలిపారు. కేసులిలా మాయమైపోయాయి. మహారాష్ట్ర సహకార బ్యాంకులో జరిగిన పాతిక వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి అజిత్‌ పవార్‌పై పెట్టిన కేసును ఈ నెల ప్రారంభంలోనే ముంబయి పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం మూసేసింది.
‘బొగ్గు’ మరక అంటినా…
కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గత వారమే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అవకతవకలకు సంబంధించి జిందాల్‌పై సీబీఐ, ఈడీ మూడు కేసులు పెట్టాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై గత నెలలో పార్లమెంటు ముందు ఉంచిన శ్వేతపత్రంలో ప్రభుత్వం బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని కూడా ప్రస్తావించింది. గనులను దోపిడీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీరాలు పలికిన ప్రధానమంత్రి, ఇప్పుడు ఆ కుంభకోణంలో నిందితుడిని ఎన్నికల బరిలో నిలిపారు. ఎన్నికల బాండ్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన పది మంది దాతల్లో నవీన్‌కు చెందిన జిందాల్‌ గ్రూపు కూడా ఉండడం గమనార్హం. ఈ గ్రూపు గత ఐదు సంవత్సరాలలో రూ.202 కోట్ల ఎన్నికల విరాళాలు ఇచ్చింది.
అక్రమ ఆస్తుల నిందితులకూ…
అక్రమ ఆస్తుల కేసులో మహారాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కృపా శంకర్‌ సింగ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయి. సింగ్‌, ఆయన కుటుంబసభ్యులు రూ.230 కోట్ల మేర అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఆరోపించాయి. సింగ్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ 2012లో బీజేపీ డిమాండ్‌ చేసింది కూడా. సింగ్‌ 2021లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడాయన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ నుండి ఎన్నికల బరిలో దిగారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దెబాశిష్‌ ధార్‌ మాజి ఐపీఎస్‌ అధికారి. అక్రమ ఆస్తుల కేసులో దెబాశిష్‌ నివాసంపై 2022లో రాష్ట్ర సీఐడీ దాడులు చేసింది. దెబాశిష్‌ గతంలో కూచ్‌బిహార్‌ ఎస్పీగా పనిచేశారు. 2021 శాసనసభ ఎన్నికల తర్వాత ఆయనను సస్పెండ్‌ చేశారు. కేంద్ర దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయిన ఉదంతానికి సంబంధించి ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఆయన ఇటీవల తన పదవికి రాజీనామ చేశారు. బీజేపీ తరఫున బిర్‌భుమ్‌ నుండి పోటీ చేస్తున్నారు.
‘దొంగ’ అంటూనే…
తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తపస్‌ రారు గత నెలలోనే బీజేపీలో చేరారు. ఇప్పుడాయన కొల్‌కతా నార్త్‌ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. మున్సిపాలిటీలలో జరిగిన ఉద్యోగ నియామకాల కుంభకోణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఈడీ ఆయన నివాసంపై దాడి చేసింది. ఆ దాడి తర్వాత రారుని బీజేపీ నేత, శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఓ దొంగగా అభివర్ణించారు. సువేందు కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన వారే.
అప్పుడు ఆరోపణలు చేసి…
జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు చెందిన ఏకైక ఎంపీ గీతా కోడా గత నెలలో కాషాయదళంలో చేరిపోయారు. ఇప్పుడామె సింగ్భమ్‌ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గీతా కోడా జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్య. బొగ్గు గనుల కుంభకోణం కేసులో ఆయనను 2017లో జైలులో ఉంచారు. గీత 2018లో కాంగ్రెస్‌లో చేరినప్పుడు బీజేపీ నాయకులు ఆమెపై పలు ఆరోపణలు గుప్పించారు. కాగా గీత తండ్రి మధు కోడా కూడా త్వరలోనే బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.
స్టార్‌ క్యాంపెయినర్‌గా ‘ఆదర్శ్‌’ చవాన్‌
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. అశోక్‌పై కూడా మోడీ గతంలో పలు అవినీతి ఆరోపణలు చేశారు. ‘ఆదర్శ్‌’ కుంభకోణంలో నిందితుడైన చవాన్‌కు కాంగ్రెస్‌ సిగ్గు లేకుండా టిక్కెట్‌ ఇచ్చిందంటూ 2014 మార్చిలో మోడీ ధ్వజమెత్తారు. చవాన్‌ ‘ఆదర్శ’ అభ్యర్థి అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే చవాన్‌ను బీజేపీ అక్కున చేర్చుకుంది. ఆదర్శ్‌ సహకార హౌసింగ్‌ సొసైటీ పేరిట వెలసిన 31 అంతస్తుల భవనంలో అశోక్‌ చవాన్‌, ఆయన కుటుంబ సభ్యులు ప్రధాన లబ్దిదారులన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఈ భవనాన్ని కార్గిల్‌ యుద్ధ వీరులు, యుద్ధంలో మరణించిన సైనికుల భార్యల కోసం నిర్మించారు. అయితే ఈ భవనంలో చవాన్‌, ఆయన కుటుంబ సభ్యులు అక్రమంగా ఫ్లాట్లు పొందారని ఈడీ తదితర సంస్థలు అభియోగాలు మోపాయి. ఆయన బీజేపీలో చేరగానే . రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడాయన బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌.