– పెండింగ్ క్లయిమ్‌లను వెంటనే పరిష్కరించాలి
– దారిమళ్లించిన నిధులను వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో అడ్వయిజరీ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధులతో పునరుద్ధరించాలని తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర గౌరవాధ్యక్షులు వంగూరు రాములు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఆ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంక్షేమ పథకాల పెండింగ్ క్లయిమ్‌లను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఇతర శాఖలకు దారి మళ్లించిన నిధులను వెంటనే వెల్ఫేర్ బోర్డులో జమ చేయాలని కార్మిక శాఖను డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.కోటంరాజు మాట్లాడుతూ..బోర్డులో వేల కోట్ల రూపాయలున్నా కార్మికులకు నష్టపరిహారాలను పెంచడంపై ఎందుకు తాత్సారం వహిస్తున్నారని కార్మిక శాఖ అధికారులను ప్రశ్నించారు. బోర్డులో రిజిస్టర్ అయ్యే సమయంలో జరిగే చిన్నచిన్న తప్పులను కూడా హైదరాబాద్‌కు వచ్చి సరిచేసుకోవాలని చెప్పటం దారుణమన్నారు. జులై 10న జరిగే డిమాండ్స్ డేలో భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకర రామ్మోహన్, కార్యనిర్వాహక అధ్యక్షులు ముదాం శ్రీనివాస్, నాయకులు ఎల్క సోమన్న, బి.జంగయ్య, సీహెచ్.లక్ష్మినారాయణ, ఉప్పలయ్య, శ్రీనివాసులు, గాలన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.