సంక్షేమ హాస్టళ్ళు.. సమస్యలకు నిలయాలు కథనానికి స్పందన..

Welfare hostels.నవతెలంగాణ – ఏర్గట్ల
నవతెలంగాణ పత్రికలో ఈ నెల 28 వ తేదీన శనివారం రోజు ప్రచురించిన”సంక్షేమ హాస్టళ్ళు సమస్యలకు నిలయాలు”అనే శీర్షికన వచ్చిన కథనానికి ఆర్మూర్ ఎ.ఎస్.డబ్ల్యూ.ఓ రాజ గంగారాం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ… విద్యార్థుల శ్రేయస్సే తమకు ముఖ్యమని,ఏర్గట్ల మండల కేంద్రంలోని ఎస్సి బాలుర వసతి గృహంలో సమస్యలు ఉన్నది నిజమేనని,భవనం పాతది అవడం వల్ల అక్కడక్కడ కొన్ని గదుల్లో పై కప్పు నుండి నీరు కారుతుందని,మరమ్మత్తులు చేయిస్తామని అన్నారు. అలాగే విద్యార్థులు ఉపయోగిస్తున్న బాత్ రూమ్ లకు ఈ ఆదివారం ప్లంబింగ్ పని మొదలు చేయడం జరిగిందని అన్నారు. అలాగే వంట మనిషి భీంరావ్ కు సమాచారం అందించడంతో ఆయన తిరిగి వచ్చారని, ప్రస్తుతం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని అన్నారు. హాస్టల్ లో ఉన్న సమస్యలను మొత్తం నివేదిక రూపంలో జిల్లా అధికారులకు పంపుతామని తెలిపారు. నా పరిధిలో 12 హాస్టళ్ళు ఉంటాయని,నెల రోజుల్లో ప్రతి హాస్టల్ ను రెండుసార్లు సందర్శించి,విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు.