సంక్షోభంలో సంక్షేమం

Welfare in crisis– కీలక రంగాలకు మొండిచేయి
– సామాజిక భద్రతపై చిన్నచూపు
– బడ్జెట్‌ కేటాయింపులు తగ్గిస్తున్న మోడీ ప్రభుత్వం
ప్రజలు గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పని చేసే హక్కు, ఆహారం-పౌష్టికాహారం పొందే హక్కు, విద్యా హక్కు, సామాజిక భద్రతా హక్కు… ఇవన్నీ పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులు. వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులదే. అయితే ఇప్పుడు ప్రజలు తమ కనీస అవసరాల కోసమూ పోరాడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
న్యూఢిల్లీ : పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఆస్తుల విక్రయంపై 2021లో మాట్లాడినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఓ మాట చెప్పారు. వ్యాపారం చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రజల సంక్షేమం, వారి అభివృద్ధే దాని లక్ష్యమన్నారు. అయితే ఆయన మాటలకు, చేతలకు పొంతనే ఉండదని గడచిన పది సంవత్సరాల బీజేపీ పాలన నిరూపిస్తోంది. సంక్షేమానికి నిధుల కేటాయింపును కుదించడం, పలు పథకాలు, కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయడం వల్ల గత పది సంవత్సరాలలో ప్రజా సంక్షేమం పడకేసింది.
2014-15 తర్వాత కేంద్ర బడ్జెట్‌ వ్యయం 150.88శాతం పెరిగింది. కానీ సామాజిక భద్రతా పథకాలకు చేసిన బడ్జెట్‌ కేటాయింపులు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్‌ ముందు కాలంతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పద్దుల కింద కేటాయింపులు మరింతగా తగ్గిపోయాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ), జాతీయ ఆహార భద్రతా చట్టం కింద చేపట్టిన సామాజిక సాయం కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఏపీ), జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) వంటి కార్యక్రమాలకు కేటాయించిన నిధులను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతకుముందు సంవత్సరంలో సవరించిన అంచనాలతో పోలిస్తే సామాజిక భద్రతా కార్యక్రమాలకు బడ్జెట్‌ కేటాయింపులు తగ్గిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీంతో అవసరాలకు, కేటాయింపులకు మధ్య పెద్ద ఎత్తున వ్యత్యాసం కన్పించింది.
ఉపాధి హామీకి తూట్లు… సామాజిక సాయం హుళక్కి
ఉపాధి హామీ పథకాన్నే తీసుకుంటే బడ్జెట్‌లో దాని వాటా 1.85శాతం (2014-15) నుంచి 1.33శాతానికి (2023-24) తగ్గింది. ఈ పథకానికి ఇంత తక్కువ కేటాయింపులు జరపడం ఇదే మొదటిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనికి 60 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది గత సంవత్సరపు సవరించిన అంచనాలతో పోలిస్తే 33శాతం తక్కువ. ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలంటే జీడీపీలో కనీసం 1.6% అయినా కేటాయించాలని ప్రపంచబ్యాంక్‌ చెబుతోంది. అయితే ప్రస్తుత కేటాయింపు కేవలం 0.198శాతం మాత్రమే. పైగా బడ్జెట్‌ కేటాయింపులో ఎక్కువ భాగాన్ని పెండింగ్‌ వేతనాల చెల్లింపుల కోసం రాష్ట్రాలకు అందజేస్తున్నారు. ఇక ఎన్‌ఎస్‌ఏపీకి కేటాయింపులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. వాస్తవానికి తగ్గాయి కూడా.
ఈ కార్యక్రమానికి 2014-15 బడ్జెట్‌లో 0.58% నిధులు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించింది 0.21శాతం మాత్రమే. 2007 నుండి జీవన వ్యయం పెరుగుతున్నప్పటికీ ఈ పథకం కింద వివిధ పద్దులకు అందజేస్తున్న సొమ్ములో మాత్రం మార్పు లేదు. ఉదాహరణకు ఈ పథకం కింద పెన్షన్‌దారులకు నెలకు రూ.200 నుండి రూ.300 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇది దేనికీ సరిపోదని పాలకులకు తెలియని విషయమేమీ కాదు. దేశంలోని సుమారు మూడు కోట్ల మంది ప్రజలకు అరకొర పెన్షన్‌ మాత్రమే లభిస్తోంది.
ఆహార సబ్సిడీకి నిధులేవి?
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, మహిళలు, పిల్లలకు ఆహార భద్రత కల్పిస్తూ పౌష్టికాహారం అందజేస్తోంది. మరి ఆహార సబ్సిడీ కోసం ప్రభుత్వం ఎంత కేటాయిస్తోందో తెలుసా? 2014-15లో బడ్జెట్‌లో 6.4శాతం కేటాయిస్తే 2023-24కు వచ్చేసరికి కేటాయింపు పెరగాల్సింది పోయి 4.38%కి తగ్గిపోయింది. దేశ ప్రజలలో ఆహార అభద్రతాభావం పెరుగుతోందని ప్రపంచ సూచికలు హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో ఆహార సబ్సిడీలను రూ.89 వేల కోట్లకు తగ్గించింది. గత సంవత్సరపు సవరించిన అంచనాలు మాత్రం ఈ పద్దును రూ.2,87,642 కోట్లుగా చూపాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకానికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఫలితంగా 81 కోట్ల మంది ప్రజల రేషన్‌ అంచనాలలో 50% తగ్గుదల కన్పించింది.
గర్భిణులు, పిల్లలకూ అరకొర నిధులే
మధ్యాహ్న భోజన పథకానికి (2021లో పేరు మార్చి పీఎం పోషణ్‌ అని పెట్టారు) ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించింది 0.25శాతం మాత్రమే. అంగన్‌వాడీ సేవలుగా పిలుస్తున్న సమీకృత బాలల అభివృద్ధి సేవలను (ఐసీడీఎస్‌) సాక్షమ్‌ అంగన్‌వాడీ-పోషణ్‌ 2.0లో విలీనం చేశారు. అయితే ఈ పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులను మాత్రం కుదించారు. సాక్షమ్‌ అంగన్‌వాడీ-పోషణ్‌ 2.0కు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.20,544 కోట్లు కేటాయించగా ప్రత్యేకించి ఐసీడీసీకి రూ.18,691 కోట్లు ప్రతిపాదించారు. ఈ పథకాలన్నింటినీ కలిపేసినా బడ్జెట్‌లో కొద్ది మొత్తమే కేటాయించడం గమనార్హం. గర్భిణులకు అందించే సాయాన్ని కూడా కుదించారు. ప్రధానమంత్రి మాతృ వందనం పథకానికి ప్రారంభంలో కొంతమేర నిధులు సమకూర్చినప్పటికీ ఆ తర్వాత దానిని సమర్త్య కార్యక్రమంలో కలిపేసి ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ.2,582 కోట్లు మాత్రమే విదిల్చారు.
ఆరోగ్యం, విద్యకు అంతంతే
ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించి బడ్జెట్‌ కేటాయింపులు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాస్తవంగా 2శాతం తగ్గాయి. ఆరోగ్య రంగానికి 2019-20 బడ్జెట్‌లో 2.46శాతం కేటాయించగా ప్రస్తుత సంవత్సరంలో అది 2.08శాతానికి తగ్గిపోయింది. కోవిడ్‌ మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసినప్పటికీ జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయింపులు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనికి కేటాయించింది 0.81శాతం. కేటాయింపులు తగ్గడంతో ప్రజలపై అధిక భాగం పడుతోంది. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. ఇక విద్యా రంగానికి కేటాయింపులను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాఠశాల విద్య, అక్షరాస్యత, ఉన్నత విద్యకు సంబంధించి బడ్జెట్‌ కేటాయింపులు 4.6% (2014-15) నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.5%కి తగ్గిపోయాయి. జీడీపీలో ప్రస్తుత విద్యా బడ్జెట్‌ 2.9%గా ఉంది. 2986లో నిర్దేశించుకున్న 6% లక్ష్యానికి ఇది చాలా దూరంలో ఉండడం గమనార్హం. మరోవైపు దేశంలో పాఠశాలల సంఖ్య కూడా తగ్గిపోతోంది. 2020-21తో పోలిస్తే 21-22లో 20 వేలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయి. బడి మానేస్తున్న విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.