సంక్షేమం..సంక్షోభం

Welfare..crisis– ఆర్థిక స్కీంలకు సీఈసీ అనుమతి తప్పనిసరి
– ట్రెజరీలో భారీగా బిల్లులు పెండింగ్‌
– ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మికీ కష్టకాలం
– నిలిచిన గొర్రెల పంపిణీ
– లబ్దిదారులే…ఓటర్లు..
– ఆ కోణంపై ఎన్నికల సంఘం దృష్టి
– సీఎస్‌ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు
సంక్షేమ పథకాల లబ్దిదారుల్నే ఓటర్లుగా నమ్ముకున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కొత్త చిక్కొచ్చిపడింది. వచ్చే నెలలో (నవంబర్‌) ఆసరా పెన్షన్లు సహా, ఆర్థికంతో ముడిపడిన అన్ని పథకాల లబ్దిదారులకూ తాత్కాలికంగా చెల్లింపులు నిలిపేయాలనే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఉన్నట్టు సమాచారం. అయితే ఇవన్నీ అమల్లో ఉన్న పథకాలే (ఆన్‌గోయింగ్‌ స్కీమ్స్‌) కాబట్టి, వాటిని నిలుపుదల చేయడం సరికాదనీ, ఆ బిల్లులకు తక్షణం అమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.
ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి
ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పైసా ఖర్చుకూ సీఈసీ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఈనెల 10వ తేదీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధ్యక్షతన ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో ఆయా శాఖల స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ కమిటీ ఆర్ధికానికి ముడిపడి ఉన్న ప్రతి అంశానికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి పంపాలి. వాటికి అనుమతి కోసం సీఈవో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతారు. ఆమోదం లేదా తిరస్కారం ఏవైనా మళ్ళీ అదే పద్ధతిలో వెనక్కి వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, గొర్రెల పంపిణీ వంటి అనేక పథకాల చెల్లింపులకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఈనెల 16వ తేదీనే సీఈఓకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పంపినట్టు సమాచారం. అయితే ఈ చెల్లింపులకు సంబంధించిన అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలుపుదల చేయమని చెప్పినట్టు తెలిసింది. ఈ స్కీంలలోని లబ్దిదారులంతా ఓటర్లే కాబట్టి, ఎన్నికల సమయంలో వారిని నేరుగా ప్రభావితం చేసినట్టు ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని ముందే ఊహించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆసరా పింఛన్‌ లబ్దిదారులకు అక్టోబర్‌ నెలలో ఇవ్వాల్సిన పింఛన్‌ డబ్బుల్ని గతనెల (సెప్టెంబర్‌) 30వ తేదీనే వారి ఖాతాల్లో జమచేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కోసం రూ.58,542 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నది. వీరిలో వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నవారు 16,44,280 మంది ఉన్నారు. వితంతు పింఛన్‌ లబ్దిదారులు 15,85,088 మంది, ఒంటరి మహిళలు 1,43,930 మంది, బీడీ కార్మికులు 4,25,793 మంది, వికలాంగులు 5,16,890 మంది ఉన్నారు. వీరితో పాటు బోదకాలు బాధితులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, కళాకారులు ఉన్నారు. కళ్యాణలక్ష్మి/ షాదీముబారక్‌ దరఖాస్తుదారులు, విదేశీవిద్య కోసం వివిధ కార్పొరేషన్లకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే వీరంతా లబ్దిదారులతో పాటు ఓటర్లుగా కూడా ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిధుల చెల్లింపులను తాత్కాలికంగా నిలుపుదల చేయమని రాష్ట్ర ట్రెజరీ విభాగానికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీనితో ట్రెజరీ నుంచి ప్రస్తుతం ఎలాంటి చెల్లింపులు జరగట్లేదని అక్కడి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎయిడెడ్‌ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు లేవనీ ఆ బిల్లులు కూడా ట్రెజరీ వద్దే పెండింగ్‌లో ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇటీవల పదోన్నతులు పొందిన టీచర్ల జీతాల బిల్లులు, ప్రభుత్వ ఉద్యోగుల ఇతర ఆర్థిక పరమైన బిల్లులు కూడా ట్రెజరీ వద్దే పెండింగ్‌లో ఉండిపోయాయి. సంక్షేమ పథకాల లబ్దిదారులతో పాటు ప్రతి చెల్లింపు విషయంలోనూ ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి కావడంతో ఈ ప్రతిష్టంభన కొనసాగుతున్నదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే 2018 ఎన్నికల సమయంలో పోలింగ్‌ రోజే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే అప్పుడూ, ఇప్పుడూ పరిస్థితులు ఒకేలా లేవంటూ సీఈఓ కార్యాలయంలో చర్చ జరుగుతుండటం గమనార్హం.
పింఛన్లు లబ్దిదారుల సంఖ్య చెల్లిస్తున్న సొమ్ము
(రూ. కోట్లలో.)
1. వృద్ధాప్య పింఛన్లు 16,44,280 18,555.71 కోట్లు
2. వితంతు పింఛన్లు 15,85,088 20,556
3. ఒంటరి మహిళలు 1,43,930 1,545.80
4. బీడీ కార్మికులు 4,25,793 5,712
5. వికలాంగులు 5,16,890 10,310
6. కల్లుగీత కార్మికులు 67,048 880.45
7. చేనేత కార్మికులు 38,240 518.58
8. కిడ్నీ వ్యాధిగ్రస్తులు 4,507 2.67
9. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ 37,005 411.80
10. కళాకారులు 1,967 49.30
(వీరుకాకుండా కళ్యాణలక్ష్మి/ షాదీముబారక్‌ లబ్దిదారులు,
గొర్రెల పంపిణీ లబ్దిదారులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు.)