క్షేత్రస్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించాలి

Welfare programs should be monitored at the field levelనవతెలంగాణ-నస్పూర్‌
జిల్లాలో చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం నుండి గూగుల్‌ మీట్‌ ద్వారా డీపీఓ వెంకటేశ్వర్‌రావు, సీఈఓ గణపతి, జిల్లాలోని 16 మండలాల తహసీల్దార్లు, 7 మున్సిపాలిటీల కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఈఓలతో పారిశుధ్యం, డెంగ్యూ నివారణ, తాగునీటి సరఫరా ఇతర అంశాలపై సమీక్షించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కొరకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలోని ప్రాంతాలలో సంబంధిత శాఖల అధికారులు ప్రతి రోజు పర్యటించాలని తెలిపారు. ప్రతి శు క్రవారం నిర్వహించే డ్రై డే కార్యక్రమంలో మురుగు కాలువలు, అంతర్గత రహదారులు, నివాస ప్రాంతాలలో నిలిచిన వరద నీటి తొలగింపు, తాగునీటి ట్యాంకులలో నీటిని మార్చడం, వ్యాధుల నియంత్రణ కొరకు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. అక్టోబర్‌ 31 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని, పారిశుధ్య నిర్వహణలో తక్షణ అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. అధికారులు తమ పరిధిలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని తెలిపారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.హరీష్‌, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు హరిశ్చంద్రారెడ్డి, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో గూగుల్‌ మీట్‌ ద్వారా జ్వర సంబంధిత కేసులు, మందులు, రక్త పరీక్షలు, వైద్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఎన్‌టిఆర్‌ నగర్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్ని రోజులుగా నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికార యంత్రాంగం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలు చేపడుతుందని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రజలు భయాందోళన చెందవద్దని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజల సహాయార్థం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్‌ రూమ్‌ నం.08736-250501 ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు అత్యవసర సేవల కొరకు సంప్రదించవచ్చని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీర ప్రాంతాన్ని సందర్శించి నీటి ప్రవాహ పరిస్థితిని పరిశీలించారు.