
– కలెక్టర్ న్యాయం చేయాలని పేద ప్రజల వేడుకలు
నవతెలంగాణ -తాడ్వాయి : తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత బంధువు, బీసి బంధు, మైనార్టీ బందు, గృహాలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ పథకాలను బీఆర్ఎస్ కార్యకర్తలకేనా అని, మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలోని ఇండ్లు లేని నిరుపేద ప్రజలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ సర్పంచులు వారు ఇష్టారాజ్యంగా ఎవరికి తెలియకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా, ఇల్లు ఉన్న వారికే గృహలక్ష్మి ఇండ్లు మంజూరయ్యాయని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వలేదని సర్పంచులను నిలదీశారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు సమాచారం లేకుండా గ్రామసభల తీర్మానం లేకుండా, ఇష్టారాజ్యంగా ఇండ్లు లేని వారికి కాకుండా, ఇండ్లు ఉన్న వారికే గృహలక్ష్మి ఇల్లు మంజూరైనట్లు పేద ప్రజలు ఆందోళన చేశారు. శుక్రవారం కామారం(పిటి) గ్రామపంచాయతీకి, ఇల్లు లేని పేదవారు గ్రామపంచాయతీ చేరుకొని మీ(సర్పంచ్) అనుమతి లేకుండా అనర్హులకు ఇల్లు ఎలా వచ్చాయని సర్పంచ్ రేగ కళ్యాణి నిలదీసి, కుర్చీలు పగలకొట్టి గ్రామపంచాయతీ లో ధర్నా చేశారు. కామారం(పిటి) సర్పంచ్ రేగా కళ్యాణి మాట్లాడుతూ నాకు ఎలాంటి సంబంధం లేకుండా, గ్రామపంచాయతీకి సమాచారం లేకుండా, గ్రామపంచాయతీ తీర్మానాలు లేకుండా గృహలక్ష్మి ఇండ్లు వచ్చాయని గ్రామస్తులకు వివరించారు. సర్పంచ్ గ్రామంలో మొదటి పౌరుడు అని, మాకు తెలవకుండా, గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రూలింగ్ లో ఉన్న సర్పంచులు ఏమో, వారికి తెలిసినప్పటికీ, గ్రామంలో ఎవరికీ తెలువకుండా, కనీసం వార్డు సభ్యులకు తెలవకుండా పంచాయతీ కార్యదర్శి, సర్పంచులు, నాయకులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా ఇండ్లున్న వారికే గృహలక్ష్మి వర్తింపజేశారని, పలు గ్రామపంచాయతీలో నిరుపేదలు నిరసన తెలియజేసి, నిలదీశారు. కలెక్టర్ స్పందించి గృహలక్ష్మి లో జరిగిన అవినీతి, అన్యాయాలను సర్వే చేయించి, పార్టీలకతీతంగా అర్హులందరికీ గృహలక్ష్మి ఇండ్లు అందేలా చర్యలు తీసుకుంటారని, మండలంలోని ఇండ్లు లేని పేద ప్రజలు కోరుకుంటున్నారు.