నవతెలంగాణ – మల్హర్ రావు
అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగు తుందని లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందొద్దని మండల ప్రత్యేకాధికారి అవినాష్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగంగా మండల కేంద్రమైనా తాడిచెర్లలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. పథకాల కోసం అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా పథకాల అమలులో భాగంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాపై ఆరా తీశారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. జాబితాలో పేరులేని అర్హులైన వారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారని తెలిపారు. మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామసభను నిర్వహించారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమ పేర్లు జాబితాల్లో రాలేదని పలువురు అధికారులను ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున్ రెడ్డి, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.