కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు

– నల్లగొండ అభివద్ధే నా ధ్యేయం
– మహిళలతో కలిసి కోలాటం ఆడిన కోమటిరెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని నల్గొండ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.శనివారం నల్గొండ పట్టణంలోని 18, 19, 42 వార్డులలో స్థానిక కౌన్సిలర్లు, నాయకులతో కలిసి కోమటిరెడ్డి విస్తత ప్రచారం నిర్వహించారు.అంతకుముందు తన క్యాంపు కార్యాలయంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు.కాలనీలలో కోలాటాలతో పార్టీ శ్రేణులు, ప్రజలు కోమటిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 18 వార్డు అమూల్య కాలనీలో మహిళతో కలిసి కోమటిరెడ్డి కోలాటం ఆడారు.అనంతరం గడపగడపకు వెళ్లి తనను గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఆరు గ్యారంటీ స్కీములతో పాటు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను తన మేనిఫెస్టోలో పెట్టిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరమని పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వీటన్నింటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు.ప్రజలంతా కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉండి ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మవద్దని కోరారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఎన్నికల ముందు మరోసారి ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ దత్తత పేరుతో నలగొండ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించాడని అన్నారు. ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏ స్థాయిలో ఉన్న తనకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండను మర్చిపోనని అన్నారు. సిద్దిపేట,సిరిసిల్లను మించి అభివద్ధి చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివాస్‌ రెడ్డి, 18 వ వార్డు కౌన్సిలర్‌ గడిగ హిమబిందు శ్రీనివాస్‌, 19 వార్డు కౌన్సిలర్‌ గణేష్‌, సూరెడ్డి సరస్వతి, ఏడు దొడ్ల వెంకటరామిరెడ్డి, నాగమణి, పాశం నరేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.