శభాష్‌.. ప్రతిపక్షమా…!

శభాష్‌.. ప్రతిపక్షమా...!అధికార పక్షానికి రాజ్యాంగ మే ఒక ప్రతిపక్షం. అది వెలుగుల దారి. అలాంటి దిక్సూచి పటిష్టమైన ప్రతిపక్షం చేతిలో వెలుగుతుంటే అధికారపక్షం ఆ దారిలో నడవక తప్పదు. ఇలాంటప్పుడు ఏ దేశ ప్రజాస్వామ్యమైనా ఫలప్రదం కాక తప్పదు. ప్రజాస్వామ్యంలో అధికారం స్వసంపూర్ణం కాదు. చర్చలానంతర నిర్ణయాధికారం మాత్రమే. చర్చలను బేఖాతరు చేస్తే ఎన్నికల కోర్టులో ప్రజలనే న్యాయమూర్తులు సిద్ధంగా ఉంటారు. పార్లమెంటులో ప్రతిపక్షానిది ప్రేక్షకపాత్ర కాదని ప్రస్తుత పార్లమెంటు చర్చలు నిరూపిస్తున్నాయి. 18వ లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, మొదటిసారిగా ప్రవేశపెట్టబడిన కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న చర్చ ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరిలూదిన విశ్వాసాన్ని కల్పిస్తున్నది. ఈ సమావేశాల్లో చర్చించబడిన అనేక అంశాలపై సానుకూల స్పందన ఉంటే మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. బీమా ప్రీమియంపై జీఎస్టీని రద్దు చేయాలన్న ఆలిండియా ఇన్సురెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నినాదాన్ని ప్రతిపక్ష సభ్యులతో సహా అధికారపక్ష కూటమిలోని కొందరు గళం కలపడంతో ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి పెరుగుతున్నది. ఇది ఫలప్రదమైన అంశాల ప్రస్తావనకున్న ప్రాముఖ్యతను తెలుపుతుంది. పార్లమెంటులో లేవనెత్తబడుతున్న కొన్ని ప్రధానాంశాల్ని పరిశీలిస్తే వాటి పరిష్కార ఆవశ్యకత అర్థమౌతుంది.
నిరుద్యోగం పేరుతో పెట్టుబడికే సేవ
తాండవిస్తున్న నిరుద్యోగ సమస్యపై అనేకమంది సభ్యులు ప్రసంగించినప్పటికీ రాజ్యసభ సీనియర్‌ సభ్యులు కపిల్‌ సిబల్‌ ప్రస్తావించిన గణాంకాలు సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను ఎత్తిచూపుతున్నాయి. దేశంలో నిరుద్యోగ రేటు 9.4శాతం ఉండగా నిరుద్యోగులలో 83.5శాతం మంది యువకులే ఉన్నారు. సీపీఐ(ఎం) సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ చెప్పిన ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్‌ సెక్టారు 2.8శాతం మాత్రమే వృద్ధి కనపరుస్తుండడం వల్ల 18.3శాతం ఉపాధిలో వేతనాల కోత విధించబడుతున్నది. అంతేకాకుండా ఒక రోజు పని చేస్తే వారం రోజులు ఉపాధి లభ్యత ఉన్నట్లు, నెల రోజులు పని దొరికితే ఏడాదిపాటు ఉపాధి ఉన్నట్లు నేషనల్‌ స్టాటస్టికల్‌ ఆఫీస్‌ గణాంకాలను జతపరచడం హాస్యాస్పదమని వారు ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 60 వేల పోలీసు కానిస్టేబుల్‌ నియామకాలకు 48లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో అర్థంతరంగా సదరు నోటిఫికేషన్‌ రద్దు చేయాల్సి వచ్చింది. ఎంప్లారుమెంట్‌ లింక్‌డ్‌ ఇన్సెంటీవ్‌ ప్రతిపాదన ద్వారా ఉపాధి కల్పించాలని టాప్‌ 500 కంపెనీలను గుర్తించారు. అయితే ఈ కంపెనీలన్నింటిలో కలిపి కేవలం 70 లక్షల ఉద్యోగులుంటారు. ఆర్థిక సర్వే ప్రకారం ప్రతి ఏటా 78 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే తప్పా నిరుద్యోగ సమస్యను అధిగమించలేము. ఈ స్కీము కింద ఉద్యోగికి రూ.15 వేలు లభిస్తే యజ మానికి 72 వేలు లభిస్తాయి. ఇది ఎవరికి లాభసాటి? నిరుద్యోగం కన్నా ఉద్యోగార్హత లేని వారి సంఖ్య పెరుగుతున్నది. నైపుణ్యం గల వారిని వెతుక్కోలేక వెనుదిరుగుతున్న యాజమాన్యాలు 81శాతం. దేశంలో 14-18 మధ్య వయసు గల పిల్లల్లో నాలుగో వంతు రెండవ తరగతి పాఠ్య పుస్తకాన్ని చదవలేకున్నారు. ఇలాంటి వారికి నైపుణ్యాభివృద్ధి ఇవ్వటానికి కేవలం 25 వేలమందికి ఇవ్వతల పెట్టారు. విద్యారుణాలకై కేవలం లక్ష మందిని ఎంపిక చేయనున్నారు.
‘ద్రవ్యోల్బణం’ లెక్కల్లోనూ మోసమే
ద్రవ్యోల్బణాన్ని 3.4శాతం ప్రకటిస్తూ ఇందులో నిత్యవసర వస్తువుల మినహాయించామని చెప్పడంలోనే ప్రభుత్వం దమననీతి దాగి ఉన్నది. నిజానికి ప్రస్తుత విధానం ప్రకారం చూస్తే అది ఐదు పాయింట్‌ ఒక శాతం ఉండగా ఆహార, ఇతర నిత్యావసర వస్తువులను కలిపి చూస్తే అది 9.5శాతంగా నమోదవుతుంది. నిజంగా ద్రవ్యోల్బణం ఇంత తక్కువగా ఉంటే బ్యాంకు రేటు (రెపో) 2023 జూన్‌ నుండి 6.5శాతం దగ్గర ఎందుకు కొనసాగిస్తున్నట్లు? ఆర్థిక వృద్ధి 6.7శాతం నుండి 8 శాతం వరకు జరుగుతుంది అనుకున్నప్పుడు ద్రవ్యోల్బణం ఎందుకు ఇంతగా పెరుగుతున్నది? వీటికి నిర్దిష్టమైన కారణాలు చెప్పకుండా ప్రభుత్వం దాటవేస్తోంది. ద్రవ్యలోటు నాలుగు శాతం లోపు ఉంచాలన్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వము ద్రవ్యలోటుని 4.9శాతం ప్రకటించినప్పుడు వృద్ధి ఎనిమిది శాతం ఎలా సాధ్యమవు తుంది అన్నది న్యాయమైన ప్రశ్న? గ్రామీణ భారతంలో ద్రవ్యోల్బణ తీవ్రత మరింత ఎక్కువ. అందుకే ఎంపీ సుప్రియ సులే అన్నట్లు ”ఇప్పుడు ఇన్ఫ్లేషన్‌ స్థాయి దాటిపోయి ష్రింక్‌ ప్లేషన్‌” (కోతలు) కొనసాగుతున్నది దేశంలో.
పన్నుల విధానం తొండి
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రత్యక్ష పన్నులు 70 శాతం ఉంటే పరోక్ష పన్నులు 30 శాతం ఉన్నాయి. మన దేశంలో పరోక్ష పన్నులు 65శాతం ఉండగా ప్రత్యక్ష పన్నులు 30శాతంగా ఉన్నాయి. ప్రత్యక్ష పన్నుల్లో ప్రధాన భాగం వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు చెల్లించే ఇన్‌కామ్‌ టాక్స్‌. ఇందులో మధ్యతరగతి, వేతన జీవులు కలిపి 55శాతం చెల్లిస్తుండగా ధనవంతుల నుండి కేవలం 40శాతం మాత్రమే వసూల్‌ అవుతున్నదని తృణముల్‌ ఎంపీ మహువా మెయిత్రీ లెక్కలన్నీ పార్లమెంటుకు అందజేశారు. జీఎస్టీ అమలు జరుగుతున్న తర్వాత రాష్ట్రాలు కేంద్ర వితరణపై ఆధారపడవలసి వస్తున్నది. జీఎస్టీకి అదనంగా కేంద్రం సెస్సుల ద్వారా సాలిన లక్ష కోట్ల దాకా వసూలు చేసు కుంటున్నది. ఇందులో రాష్ట్రాలకు భాగస్వామ్యము లేదు. మూలధన లాభాలపై ఇండెక్షేషన్‌ తీసేయడం వల్ల ప్రజలపై మరింత భారం మోపినట్లయింది. కార్పొరేట్‌ టాక్స్‌ 33శాతం నుండి 20శాతం తగ్గించడం వలన, ఆస్తి పన్నును 2015లో రద్దు చేయడం, వారసత్వ పన్ను విధించకపోవడం వలన ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. అందువల్ల పరోక్ష పన్నులపై ఆధారపడాల్సి వస్తుంది.
సమాఖ్య వ్యవస్థకు తూట్లు
కేంద్రం సర్వ వ్యవస్థలనూ కొత్త చట్టాలు రూపొందించడం ద్వారా ఆక్రమిస్తున్నది. 2015లో ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా డిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పరిపాలనా సంబంధిత విభాగాలపై సర్వాధికారాలను ఇవ్వటాన్ని సుప్రీంకోర్టు తోసి పుచ్చగా 2023 కేంద్రం పార్లమెంటులో ఆర్డినెన్స్‌ని పాస్‌ చేసి తన పంతాన్ని నెగ్గించుకున్నది. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌కి అధికారులను నియమించే అధికారాన్ని కూడా ఎల్‌జికి అప్పజెప్పింది. నూతన విద్యావిధానం అమలు తర్వాత మరిన్ని ఘటనలు బయట పడుతున్నవి. నూతన బ్రాడ్‌కాస్టింగ్‌ బిల్లును ప్రతిపాదించడం ద్వారా, సమాచార వ్యవస్థని తమ గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా, ఇతర వ్యవస్థలని నిర్వీర్యం చేస్తూ సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నది. సమాఖ్యను ప్రస్తుత ప్రభుత్వం గౌరవించడం లేదన్న దానికి మణిపూరే ఉదాహరణ. తక్కువ తలసరి ఆదాయంతో ఎక్కువ ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ఈ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా విస్మరిస్తోంది.
ఈ సమావేశాల్లో రాహుల్‌ గాంధీ వ్యవసాయ సంక్షోభం, తాండవిస్తున్న నిరుద్యోగం వంటి ప్రాధాన్యతాంశాలను ప్రస్తావించడమేగాక ఏడాదికాలంగా మండిపోతున్న మణిపూర్‌ అంశాల్ని చాకచక్యంగా ప్రస్తావించారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు హల్వా దగ్గరి నుండి కులగణన వరకు, వర్షానికి లీకయ్యే కొత్త పార్లమెంట్‌ నుండి ఢిల్లీలో సెల్లార్‌ వరదనీటిలో కొట్టుకుపోయిన ఐఏఎస్‌ కోచింగ్‌ విద్యార్థుల వరకు ఆయన ప్రస్తావించారు. వెరసి ఈ పార్లమెంటు సమావేశాలు ప్రతిపక్షాల పాత్రని శభాష్‌ అనేలా చేశాయి.
జి.తిరుపతయ్య
9951300016