జరుగుతున్న పరిణామాలను చూస్తే మధ్య ప్రాచ్యం ఏ క్షణంలోనైనా మంటల్లో మాడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఏడాది కాలంగా గాజాలో వేలాది మందిని ఊచకోతకోస్తూ మారణహోమానికి పాల్పడుతున్న ఇజ్రాయిల్‌ను పల్లెత్తు మాట అనని పశ్చిమదేశాలు మంగళవారంనాడు ఇరాన్ జరిపిన క్షిపణిదాడితో ”ఇంత ఘోరమా” అన్నట్లు నాటకాలు ఆడుతు న్నాయి. ఏడాదిగా గాజాలో జరుపుతున్న మారణకాండగానీ, ఆ దాడికి ముందు ఇజ్రాయిల్ సేనలు లెబనాన్‌లోకి ప్రవేశించి గ్రామాలకు గ్రామాల పౌరులను ఖాళీ చేయించేందుకు బాంబులు వేయటం సదరు అపర ”మానవతామూర్తుల”కు కనిపించలేదు. లెబనాన్‌లో తన రివల్యూషనరీ గార్డుల కమాండర్ అబ్బాస్‌ను హిజబుల్లా నేత నస్రల్లాతో పాటు హత్య చేసిన ఇజ్రాయిల్ చర్యకు ప్రతీకారంగా తాను జరిపిన దాడి ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. గతంలో సిరియాలో తమ నేతలను హత్య చేసినందుకు గాను ఇరాన్ ఇదే మాదిరి ఒక రోజు క్షిపణి దాడి జరిపిన సంగతి తెలిసిందే. నాటి దాడిలో 140 క్షిపణులను ప్రయోగించగా ఈసారి 180 వచ్చినట్లు ఇజ్రాయిల్ చెబుతున్నది. తాజా దాడి అంతకు ముందు జరిపిన దాని కంటే తీవ్రమైనదని చెబుతున్నారు. దీనికి స్పందనగా పశ్చిమదేశాల మాటలు, చేతలు, ఇజ్రాయిల్ ప్రకటనలను చూస్తే పరిస్థితి చేయిదాటేట్లు కనిపిస్తున్నది. తమ క్షిపణులు లక్ష్యాలను తాకినట్లు ఇరాన్ చెప్పగా అబ్బే అలాంటిదేమీ లేదు తమ రక్షణ వ్యవస్థలు వాటిని మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ చెప్పుకుంది.
పశ్చిమదేశాల అంచనా ప్రకారమే ఇరాన్ వద్ద మూడువేల ఖండాంతర క్షిపణులున్నట్లు వార్తలు వచ్చాయి.తాజాగా తాము ప్రయోగించిన క్షిపణి ఫతా-1 ఆధునికమైనదని, ధ్వని కంటే ఐదురెట్ల వేగంతో గంటకు 6,100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని లక్ష్యాలను మూడువందల మీటర్ల ఖచితత్వంతో విధ్వంసం సృష్టించగలదని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ వద్ద లేదా దానికి సరఫరా చేసే పశ్చిమ దేశాల వద్ద అంతకంటే ఆధునికమైన ఆయుధాలు ఉన్నమాట కూడా వాస్తవం. అందువలన వాటిని మదింపు వేసుకున్న తరువాత పరస్పరం తారసిల్లితే ప్రపంచం మొత్తం ప్రభావితం కావటం అనివార్యం.అదే జరిగితే దానికి ఇజ్రాయిల్, దానికి వెన్నుదన్నుగా ఉంటున్న పశ్చిమదేశాలదే బాధ్యత అవుతుంది. యుద్ధ మంటూ ప్రజ్వరిల్లితే అది ఒకదేశానికే పరిమితం కాదు, ముందుగా బలయ్యేది సామాన్య జనం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇజ్రాయిల్ , పశ్చిమదేశాలు ఎంతగా రెచ్చగొడుతున్నా ఇరాన్‌తో సహా అనేకదేశాలు సంయమనం పాటిస్తున్నాయి. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇరాన్ వదలిన కొన్ని క్షిపణులను మధ్యధరా సముద్రంలో తిష్టవేసిన తమ రెండు నౌకదళ డిస్ట్రాయర్లు కూల్చివేసినట్లు అమెరికా ప్రకటించింది. అదే విధంగా జోర్డాన్‌లో పశ్చిమదేశాలు ఏర్పాటు చేసిన వ్యవస్థలు కూడా కొన్నింటిని కూల్చివేసినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. తదుపరి చర్యల గురించి చురుగ్గా చర్చిస్తున్నట్లు జోబైడెన్ చెప్పాడు. ఎలాంటి తప్పులు చేయకుండా మద్దతు ఇవ్వాలని తన యంత్రాంగాన్ని హెచ్చరించాడు. తమ మిలిటరీ వనరులను ఆ ప్రాంతానికి తరలిస్తున్నట్లు ఫ్రాన్సు ప్రకటించింది. అంటే పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్ తరఫున రంగంలోకి దిగినట్లే.వాటిని వ్యతిరేకించే దేశాలు ఈ పరిస్థితిని చూస్తూ ఉండజాలవు.
తాజా పరిస్థితిని చూస్తే రెండు పక్షాలుగా ప్రపంచం సమీకృతం కావటాన్ని పశ్చిమదేశాలు వేగిరం చేస్తున్నాయి. కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. మధ్యవర్తులుగా నటిస్తూ శాంతి కబుర్లు చెప్పే తోడేళ్లు తమ మేకతోళ్లను తీసిపక్కన పడేస్తున్నాయి. ఆత్మరక్షణ పేరుతో యూదు దురహంకారులను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ నేతలు ఇజ్రాయిల్‌కు మద్దతుగా నిలిచాయి. లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడిని టర్కీ ఖండిస్తూ తక్షణమే ఐరాస జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. నెతన్యాహు మరో హిట్లర్‌గా మారాడని వర్ణించింది.రష్యా కూడా ఇరాన్ చర్యను సమర్ధించింది. దీనికి అమెరికా వైఖరే కారణమని చెప్పింది. ఎమెన్,లెబనాన్ కూడా ఖండించాయి. చైనా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయనప్పటికీ ఇరాన్‌కు అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.ఇరు పక్షాలూ తమ ఆయుధాల పనితీరును పరీక్షిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇజ్రాయిల్, ఉక్రెయిన్‌లకు పశ్చిమదేశాలు తమ ఆయుధాలను అందించినట్లే రష్యా తన దగ్గర ఉన్నవాటిని అవసరమైతే రానున్న రోజుల్లో ఇరాన్‌కు అందజేసినా ఆశ్చర్యం లేదు. బాధ్యత రెండువైపులా ఉండాలి తప్ప ఒకవైపే అంటే కుదిరే రోజులు కావివి.