బ్రిస్బేన్ : ఆసీస్ కంచుకోట గబ్బాను కరీబియన్ల వశమైంది!. వర్థమాన యువ క్రికెటర్లతో కూడిన వెస్టిండీస్ ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై 8 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 216 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా 207 పరుగులకే కుప్పకూలింది. కరీబియన్ యువ పేసర్ షామర్ జోసెఫ్ (7/68) నిప్పులు చెరిగే ప్రదర్శనతో కంగారూలు తోక ముడిచారు. ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్, 146 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), కామెరూన్ గ్రీన్ (42, 73 బంతుల్లో 4 ఫోర్లు) పోరాడినా.. ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 311 పరుగులు చేయగా.. ఆసీస్ 298/9 పరుగులే చేసింది. 22 పరుగుల వెనుకంజలో నిలిచినా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 193 పరుగులు చేసింది. కరీబియన్లను తక్కువ అంచనా వేసిన ఆసీస్ గబ్బా టెస్టు ఓటమితో భారీ మూల్యం చెల్లించుకుంది. కరీబియన్ పేసర్ షామర్ జొసెఫ్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను దక్కించుకున్నాడు.