ఒక నాడు ఫ్రాన్సు, ఇటలీ వలసగా ఉండి సాహేల్ ప్రాంతంగా పిలిచే ఆఫ్రికా ఖండ పశ్చిమ దేశాల్లో ఒకటైన నైగర్‌లో పశ్చిమ దేశాలు తమ తొత్తు పాలకుడికి రక్షణగా మిలిటరీ జోక్యానికి దిగుతాయా? గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. గత నెల 26న నైగర్‌లో సైనిక తిరుగుబాటు జరిగింది. పశ్చిమ దేశాలకు వంత పలికే అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్ ప్రస్తుతం గృహనిర్భంధంలో ఉన్నాడు. మిలిటరీ జనరల్ మహమ్మద్ చియానీ అధికారంలోకి వచ్చినట్లు ప్రకటించుకున్నాడు. గతంలో వలస పాలకులుగా ఉన్న ఫ్రాన్స్, దానికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర ఐరోపా ధనికదేశాల మీద ఇప్పుడు నైగర్‌లో తీవ్ర నిరసన వెల్లువెత్తుతున్నట్లు, దానికి తిరుగుబాటు మిలిటరీ అధికారుల మద్దతు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి నైగర్‌లో పశ్చిమ దేశాల కుట్రలు, ఎత్తుగడలకు వ్యతిరేకంగానే ఈ తిరుగుబాటు జరిగినట్లు కనిపిస్తోంది. రెండు కోట్ల 70 లక్షల మంది జనాభాతో ప్రపంచంలో అతి పేద దేశాల్లో ఒకటిగా ఉన్న నైగర్‌లో సహజ సంపదలకు కొదవ లేదు. వాటిని సమాజపరం చేయని కారణంగానే అక్కడ దరిద్రం తాండవమాడుతోందని చెప్పవచ్చు.
బంగారం, సిలికాన్‌తో పాటు రెండువందల కోట్ల పీపాల ముడి చమురు నిల్వలు ఉన్న నైగర్ మీద సహజంగానే పశ్చిమ దేశాలు కన్నువేశాయి. ప్రపంచంలో యురేనియం ఉత్పత్తి చేసే దేశాల్లో అది ఆరవ స్థానంలో ఉంది. ఐరోపా సమాఖ్య తనకు అవసరమెన యురేనియం అవసరాల్లో నాలుగో వంతు నైగర్ నుంచే తీర్చుకుంటున్నది. ఫ్రాన్స్ రెండు గనుల మీద ఆధిపత్యం కలిగి ఉంది. ఇంత విలువైన వనరులు ఉన్నప్పటికీ ప్రపంచబ్యాంకు 2021 నివేదిక ప్రకారం జనాభాలో కేవలం 18.6శాతం మందికే విద్యుత్ అందుబాటులో ఉంది. ఐరోపా దేశాలలో వెలుగులు నింపే అణు విద్యుత్ రియాక్టర్లకు ఇంధనాన్ని సరఫరా చేసే దేశం చీకటిలో మగ్గటం నిజంగా దారుణం. యురేనియంతో ఒక్క విద్యుత్ మాత్రమే కాదు, అణ్వాయుధాలను కూడా తయారు చేస్తారు. అందుకే నైగర్‌ను తమ పట్టులో ఉంచు కోవాలంటే తిరుగుబాటు చేసిన మిలిటరీ అధికారులను తప్పించేందుకు మిలిటరీ చర్యకు దిగుతామని పశ్చిమ దేశాలు బెదిరిస్తున్నాయి. తమను వలస చేసుకొని దుర్భరపరిస్థితిలోకి నెట్టిందన్న కోపం ఇప్పటికీ ఫ్రాన్సు మీద నైగర్ పౌరుల్లో ఉంది. తాజా పరిణామాలతో అది మరింతగా పెరిగింది. జనం వీధుల్లో జరుపుతున్న ప్రదర్శనల్లో రష్యా పతాకాలు కూడా దర్శనమిచ్చినట్లు దృశ్యాలు వెల్లడించాయి. నైగర్ పరిసర దేశాల్లో ఐఎస్ తీవ్రవాదుల మీద పోరాటం పేరుతో పశ్చిమ దేశాల మిలిటరీ తిష్టవేసింది. నిజానికి అది ఉగ్రవాదుల మీద పోరుకంటే అక్కడున్న తమ అనుకూల పాలకులకులను కాపాడేందుకే అన్నది స్పష్టం. పశ్చిమ దేశాల కుట్రలకు బలవుతున్న రష్యా ఆఫ్రికా, పశ్చిమాసియా ఇతర ప్రాంతాల్లో రంగంలోకి దిగి అమెరికా కూటమిని వ్యతిరేకిస్తున్న శక్తులకు మిలిటరీ, ఇతరంగా కూడా మద్దతు ఇస్తున్నది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, పశ్చిమ దేశాలు విధించే షరతులతో కూడిన రుణాలు, పెట్టుబడులకు భిన్నంగా ఇటీవలి కాలంలో ఆఫ్రికా దేశాలలో పెద్ద ఎత్తున చైనా పెట్టుబడులు పెడుతున్నది. సహజంగానే వాటి పట్ల అక్కడి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ కారణంగా కూడా నైగర్‌ను తమ అదుపులో ఉంచుకొనేందుకు పశ్చిమ దేశాలు జోక్యానికి సిద్దపడుతున్నట్లు చెప్పవచ్చు. అదే జరిగితే ఆఫ్రికాలో, ప్రపంచంలో పరిణామాలు మరో మలుపు తిరుగుతాయి.
జీహాదీ గుంపుల హింసాకాండ అదుపులో విఫలం, ఆర్థిక సంక్షోభ నివారణలో నిర్లక్ష్యం, దిగజారుతున్న భద్రతా పరిస్థితి కారణంగానే తాము అధికారాన్ని చేపట్టవలసి వచ్చిందని తిరుగుబాటు నేతల ప్రభుత్వం ప్రకటించింది. ఆఫ్రికాలో రెండవ పెద్ద దేశమైన కాంగో (గతంలో దాన్ని జైరే అని పిలిచారు) బెల్జియం వలస పాలన నుంచి విముక్తి కొరకు పోరు సాగించిన జాతీయోద్యమ నేత పాట్రిస్ లుముంబా 1960లో అధికారానికి వచ్చి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పశ్చిమ దేశాల దోపిడీ నివారణకు పూనుకోగానే పశ్చిమ దేశాల ఏజెంటుగా మిలిటరీ అధికారి మొబుటు కుట్ర చేసి హతమార్చిన దుర్మార్గం నైగర్‌లో కూడా పునరావృతం కానుందా అని కొందరు ఈ సందర్భంగా సందేహం వెలిబుచ్చటం గమనార్హం. తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు ముప్పు వచ్చినప్పుడు సామ్రాజ్యవాదులు ఎంతకైనా తెగిస్తారన్నది తెలిసిందే. అవసరమైతే మిలిటరీ జోక్యం చేసుకుంటామని ఫ్రాన్స్ హెచ్చరికలో అర్థమిదే. నైగర్ పరిణామాల మంచి చెడ్డలు దాని అంతర్గత అంశం. అక్కడి జనం తేల్చుకుంటారు. ఇతర దేశాలు వేలుపెట్టటం ఏమాత్రం తగని పని.