గాజా, ఉక్రెయిన్‌లపై పశ్చిమ దేశాల కపటత్వం

West's hypocrisy over Gaza Ukraineఉక్రెయిన్‌ పైన ఒక వైఖరి, గాజాపైన దానికి పూర్తిగా భిన్నమైన వైఖరి తీసుకుంటున్న పశ్చిమ దేశాలకు నీతి, నియమాల గురించి మాట్లాడే హక్కు ఏమాత్రం లేదని టర్కీ విదేశాంగ మంత్రి హకన్‌ ఫిదన్‌ అన్నాడు. గాజాలో జరుగుతున్న యుద్ధం, లెబనాన్‌ పైన ఇజ్రాయిలీ దాడి, ఎర్ర సముద్రాన్ని యెమెనీ మిలిటెంట్లయిన హౌతీలు దిగ్భందించటం వంటి విషయాల గురించి ఆయన ఒక పత్రికా సమావేశంలో మాట్లాడిన సందర్బంగా పై విషయాన్ని చెప్పాడు. ”గాజాలో జరుగుతున్నమానవ హననంవల్ల పశ్చిమ దేశాలు, యూరోపియన్లు తాము కూడబెట్టుకున్న గౌరవాన్ని, ప్రతిష్టను ఆకస్మికంగా పోగొట్టుకున్నారు. మానవాళి ద్రుష్టిలో ముఖ్యంగా మన తరంలో వాళ్ళు తమ ప్రతిష్టను పూర్తిగా కోల్పోయారు.” అని ఫిదన్‌ పాత్రికేయులతో చెప్పాడు. పోయిన ప్రతిష్ట వాళ్ళకు తిరిగి రాదని కూడా ఆయన చెప్పాడు. గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దారుణ మారణకాండపై, ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంపైన పశ్చిమ దేశాల ప్రకటితఅధికార వైఖరిని పోల్చినప్పుడు వారి కపటత్వం శిఖరాగ్రానికి చేరిందనేది సుస్పష్టం. నీతి, నియమాలను పట్టించుకోని వారికి వాటిని గురించి మాట్లాడటం సాధ్యపడదని, ఇదంతా ఒక పెద్ద భౌగోళిక వ్యూహ సంబంధిత సంక్షోభానికి దారితీస్తుందని ఫిదన్‌ చెప్పాడు. ఒకవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు గాజాలో ఇజ్రాయిల్‌ చేస్తున్న నరమేధానికి ఎటువంటి షరతులులేకుండా మద్దతు తెలుపుతుండగా రష్యా, చైనాల వైఖరి వేరుగా వుంది. ఈవిధంగా ఆ ప్రాంతంలో సమతౌల్యం ఆవిర్బవిస్తూవుందని ఆయన చెప్పాడు. గాజా సమస్యని శాంతియుతంగా పరిష్కరించటానికి, వారి విధానాన్ని సమన్వయం చేయటానికి టర్కీ తో పాటు మధ్య ప్రాచ్చంలోని అనేక ముస్లిం దేశాలు ఒక ‘కాంటాక్ట్‌ గ్రూప్‌’ను ఏర్పాటుచేశాయని ఫిదన్‌ రిపోర్టర్లలకు గుర్తుచేశాడు. టర్కీలో ఇజ్రాయిల్‌ కోసం గూఢచర్యం జరుపుతున్న33మంది ఏజంట్లను అరెస్టు చేసిన మరుసటి రోజు టర్కీ విదేశాంగ మంత్రి ఈ ప్రకటన చేయటం గమనార్హం. గాజాలో పాలస్తీనా వాసులపైన హత్యాకాండను జరుపుతున్న ఇజ్రాయిల్‌ ప్రధాని బెన్జమిన్‌ నేతాన్యాహు ‘హిట్లర్‌ కన్నా నీచుడు’ అని గత వారం టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ నిందించాడు. గాజాలో ఇప్పటివరకు 22000మంది పాలస్తీనా ప్రజలను ఇజ్రాయిల్‌ హతమార్చింది.