తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి: నారి ఐలయ్య

నవతెలంగాణ – వలిగొండ రూరల్
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని  వీడి అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు లు డిమాండ్ చేశారు. బుధవారం రోజున సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్వర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిన్న కురిసిన అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఒకవైపు  దాన్యం  మార్కెట్లలోకి రైతులు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా వాటిని కొనుగోలు చేసి మార్కెట్ ల నుండి  తరలించడంలో ప్రభుత్వం నుండి తీవ్రమైన జాప్యం జరగడం వల్లనే రైతులకు ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. మండలం లో  అనేక గ్రామాల్లో  ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం ఇంకా నిలువ ఉందని దీనివల్ల నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం తో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వం మిల్లర్ల మధ్య రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం  మిల్లర్లకు గోదాములను కేటాయించడం లేదని పేరుతో మిల్లర్లు ధాన్యాన్ని ప్రభుత్వం నుండి  కొనుగోలు  చేయకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వం వెంటనే మిల్లర్లతో చర్చించి ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని, లారీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కమిటీ సభ్యులు కల్కూరి ముత్యాలు, శాఖ కార్యదర్శి కల్కూరి వాసు, నాయకులు వేముల జ్యోతిబసు,లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు.