జీవవైవిధ్యానికి ఆలవాలం చిత్తడి నేలలు

జీవవైవిధ్యానికి ఆలవాలం చిత్తడి నేలలు– పరిరక్షించుకోకపోతే భవిష్యత్‌ తరాలకు ప్రమాదకరం : అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జీవవైవిధ్యానికి చిత్తడి నేలలు ఆనవాలమనీ, వాటిని పరిరక్షించుకోకపోతే భవిష్యత్‌ తరాలు ప్రమాదంలో పడతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. చిత్తడి నేలల పరిరక్షణకు సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేయాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొందని నొక్కిచెప్పారు. తెలంగాణలోని చిత్తడి నేలల పరిరక్షణ, వాటి గుర్తింపు తదితర అంశాలకు సంబంధించి బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో స్టేట్‌ వెట్‌ ల్యాండ్స్‌ అథారిటీ చైర్మెన్‌, మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజంగా, కాలువల ప్రవాహంతో, మనుషుల ప్రమేయంతో ఏర్పడిన చిత్తడి నేలలను గుర్తించడంతో పాటు వాటి పరిరక్షకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలనీ, ఒక్కొక్క శాఖ నుంచి నోడల్‌ అధికారి ఈ వివరాలను చిత్తడి నేలల గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి అందజేయాలని సూచించారు. తద్వారా ఆ నేలల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టే అవకాశం కలుగుతుందన్నారు. ‘రామ్‌ సర్‌ ఒప్పందం’లోని ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశంలో 75 సైట్లుండగా, తెలంగాణలో ఒక్క సైట్‌నూ గుర్తించపోవడం విచారించాల్సిన విషయమని చెప్పారు. గత ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని విమర్శించారు. ‘రామ్‌ సర్‌’ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణలో మూడు నాలుగు సైట్లు గుర్తించే అవకాశాలున్నాయని అధికారులు ప్రస్తావించగా.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీ ప్రసాద్‌, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌, పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం.డోబ్రియాల్‌, అటవీ, పర్యావరణ శాఖ అడిషనల్‌ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మెడికల్‌ ప్లాంట్‌ బోర్డ్‌ సోని బాల దేవి తదితర ఉన్నతాధికారులతో పాటు అటవీ, పర్యావరణం, నీటిపారుదల, పంచాయతీ రాజ్‌, రెవెన్యూ, ఫిషరీస్‌, టూరిజం శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.