ఏమున్నది గర్వకారణం?

ఏమున్నది గర్వకారణం?రెజ్లర్ల ఆందోళనతో ప్రారంభమైన 2023 మాయని గాయంలా ఇప్పటికి వెక్కిరిస్తూనే ఉంది. రావణకాష్టంలా రగులుతున్న మణిపూర్‌ , అన్నదాతల ఆత్మహత్యలు, గవర్నర్ల వివాదాలు, రాజ్యాంగంలో పీఠిక తొల గింపు… చివరకు పార్లమెంటులో ఆగంతకుల అలజడి. ఇది 2023. ఇవి తప్ప దేశంలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం. డిసెంబర్‌ 31న గతేడాదికి వీడ్కొలు పలుకుతూ మన ప్రధాని మన్‌కీ బాత్‌లో ‘2023లో దేశం ఎన్నో ఘనతలు సాధించింది. దేశ ప్రజల్లో వికసిత్‌ భారత్‌ స్ఫూర్తి రగిలింది. దాన్ని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలి’ అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భావోద్వేగ భాషకు, ఆవేశం ఉట్టిపడే హావభావాలకు పెట్టింది పేరు మన ప్రధాన మంత్రి… ఆయన వక్తృత్వ పటి మ నిజంగానే గొప్పది. గొంతు చించుకుని మాట్లాడే మోడీ ”మన్‌ కీ బాత్‌” ప్రసంగాలలో మాత్రం చాలా మంద్రంగా మాట్లాడతారు. ఆ ప్రసంగాలలో సారం కన్నా ప్రసంగించే తీరుకే అధిక ప్రాధాన్యం.
దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు (నారీశక్తి వం దన్‌) 2023లోనే ఆమోదం పొందిందన్న సంగతిని మాత్రమే గుర్తుచేసిన మోడీ సార్‌. దాని అమలు గురించి మాటైనా మాట్లాడింది లేదు. బిల్లు ఆమోదం పొందినా అమలుకు నోచుకోనంత వరకు దాని వలన ప్రయో జనం ఏం ఉంటుంది. అయినా, ‘నారీశక్తి వందన్‌’ గురించి చెప్పినప్పుడు బిల్కిస్‌ బానో గురించో, ఉన్నావ్‌ మైనర్‌ బాలిక గురించో, ఢిల్లీ వీధుల్లో పోరాడుతున్న రైజర్లల గురించో, మణిపూర్‌లో స్త్రీలను వివస్త్రలను చేసిన వారిపై తీసుకున్న చర్యల గురించో మాట్లాడింది లేదు. తెలివిగా వాటిని ఆయన విస్మరించారు. అయినా, ఆయన దంతా ‘వన్‌ వే ట్రాఫిక్‌’ విన్యాసం కదా!
‘ఆత్మనిర్భరత స్ఫూర్తి సర్వత్రా విరాజిల్లుతోంది. ఆహారోత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాం’ అంటున్నారు ప్రధాని. కానీ, అన్నమో రామచంద్ర అంటూ అర్థాకలితో గుక్కెడు నీళ్లు తాగి బలవంతాన నిద్రలోకి జారుకునే వారు ఇంకా కోట్లల్లోనే ఉన్నారు. మరి ‘ఫిట్‌ ఇండియా’ ఎలా సాధ్యం?. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ గురించి ప్రస్తావిం చిన దేశాధినేత ఈ 75 ఏండ్ల కాలంలో జనానికి అందే ఆహార ధాన్యాలలో పెరుగు దల నేలబారుగానే ఉందన్న విషయాన్ని మాత్రం మరిచారు. ఎక్కడో జరిగిన ఏదో చిన్న సంఘటపై మన్‌ కీ బాత్‌లో లెక్చర్లిచ్చే మోడీ సార్‌.. పార్లమెంటు దాడి విషయంలో మూగనోము ఎందుకు పట్టారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సున్నితమైన విషయాలెన్నో మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించి ఆయన భావోద్వేగం చెంది, ప్రజలకు పంచే ప్రధాని, ‘చార్‌ధామ్‌ టన్నల్‌లో’ చిక్కుకున్న 40 మంది కార్మికుల గురించి, మత ఘర్షణలు, యూపీలో విచక్షణారహిత ఎన్‌కౌంటర్లు, ఫెడరలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం చివరకు రాజ్యాంగంపై కూడా దాడులు జరుగుతున్నా ఆయన ‘మాన్‌కీ బాత్‌’లో వీటికి చోటు ఉండదు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్స వం కోసం దేశమంతా ఉత్సుకతతో ఎదురు చూస్తోందని’ సెలవిచ్చారు. నిజానికి 108 ఎపిసోడ్లుగా పేదరిక నిర్మూలనో, ఉద్యోగాల ప్రకటనో చెబుతారని ఆశగా దేశం నిరీక్షి స్తోంది. అవేమి పట్టించుకోని ప్రధాని ‘గత కొన్ని రోజుల్లో అనేక మంది శ్రీరాముడు, అయోధ్యపై కొత్త గీతాలు, పద్యాలు, భజనలు సృష్టించారని’ తెలిపారు. వాటన్నింటినీ ‘శ్రీరామ్‌ భజన్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కూడా పిలుపునిచ్చారు. వాస్తవానికి ఈ దేశ యువత చేయాల్సింది అది కాదు. ‘ఉద్యోగమో రామచంద్రా’ అన్న హ్యాష్‌ ట్యాగ్‌ను ప్రధానికి పంపాలి.
మొన్నటికి మొన్న ఒక ప్రముఖ న్యూస్‌ ఛానల్‌తో మాట్లా డుతూ … 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి జ్ఞాన్‌ (జీవైఏఎన్‌,.. జీ- పేదలు, వై- యువత, ఏ- అన్నదాతలు, ఎన్‌-మహిళా శక్తి) అనే విజన్‌ ఉందని తెలి పారు. ఏ ప్రభుత్వానికైన విజన్‌ ఉండటం అవసరమే. దానిని కాదని ఏవరూ అనలేరు. కానీ, అదే సందర్భంలో గతంలో ఇదే ప్రభుత్వం ఇచ్చిన హమీల సంగతి కూడా చెప్పాలి. అది ఆయన బాధ్యత.
ప్రజాస్వామ్య దేశంలో పాలకుల మనసులో మాటలు ప్రజలు వినడమే కాదు. ప్రజల మనసులో మాటలు కూడా పాలకులు వినగలగాలి. కానీ, మన ప్రధానమంత్రి మోడీ గారిదంతా ‘వన్‌ వే ట్రాఫికే’ తప్ప ఎన్నడూ ప్రజా సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదు. ప్రజల ప్రస్తావనలేని, వారికి జవాబులు దొరకని కార్యక్రమం ఏదైనా ఎంత గొప్పదైనా ప్రజల మన్నన పొందజాలదు. ఇలా చెప్పుకుంటూపోతే వీరి నేతృత్వంలో దేశంలో మతోన్మాదుల దురాగతాలకు అంతే లేదు. హిందూత్వ ఎజెండాతో రక్తపుటేరులు పారిస్తున్న మోడీ, నిత్యం కార్పొరేట్ల సేవలో తరించడమే తప్ప సామాన్యులకు చేసిందేమిటి? ‘మాన్‌కీ బాత్‌’లో విన సొంపైన ప్రసంగాలు, నీతి బోధనలు తప్ప. ఇదంతా ‘పులి-బాటసారి’ కథ బాపతే. అందుకే ప్రజలారా..! తస్మాత్‌ జాగ్రత్త..!