– ఇండియా-డితో దులీప్ పోరు
అనంతపురం: దులీప్ ట్రోఫీలో ఇండియా-ఏ వరుసగా రెండో విజయం సాధించింది. అనంతపురంలోని ఆర్‌డీటీ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-డిపై 186 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 488 పరుగుల కొండంత ఛేదనలో ఇండియా-డి తేలిపోయింది. తనుశ్ కోటియన్ (4/73), శామ్స్ ములాని (3/117) వికెట్ల జాతర చేయగా.. ఇండియా-డి 82.2 ఓవర్లలో 301 పరుగులకు కుప్పకూలింది. రికీ భురు (113, 195 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో మెరిసినా.. సహచర బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. ఇండియా-ఏ వరుస ఇన్నింగ్స్‌ల్లో 290, 380 పరుగులు చేయగా.. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులే చేసింది. ఇండియా-ఏ బౌలర్ శామ్స్ ములాని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇండియా-బి, ఇండియా-సి మధ్య జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇండియా-సి తొలి ఇన్నింగ్స్‌లో 525 పరుగుల భారీ స్కోరు చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-బి 332 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా-సి 128/4 వద్ద డిక్లరేషన్ ప్రకటించింది. కానీ మ్యాచ్ ఆఖరు రోజు కావటంతో ఇండియా-బి బ్యాటింగ్‌కు రాకుండానే కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇండియా-సి మూడు పాయింట్లు సాధించగా, ఇండియా-బి ఓ పాయింట్ ఖాతాలో వేసుకుంది.