– హామీలు అమలు చేయకపోతే ఊరుకోం
– కేంద్రం సహకరించకుంటే చేయరా? : ఎ.మహేశ్వర్‌రెడ్డి
– బీజేపీకి సిగ్గుండాలే : మంత్రి పొన్నం ప్రభాకర్
– పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కోసం ఏకగ్రీవ తీర్మానం చేద్దాం : కడియం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల చుట్టే తిప్పుతున్నదనీ, మిగతా 412 హామీల సంగతేంటి? అని బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. హామీలను నెర వేర్చేందుకు నిధుల్ని ఏవిధంగా సమకూర్చుకుంటారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్య వాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో చెప్పిన 418 హామీలకు చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తారని అడిగారు. ప్రజావాణి కార్యక్రమం ప్రజాసమస్యలను పరిష్క రించే వేదికగా ఉండాలిగానీ పబ్లిసిటీ వేదికగా మార్చొద్దని సూచించారు. రోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని చెప్పి..ఇప్పుడు వారానికి రెండు రోజులే అని చెప్పడం ఎంతవరకు సబబని అడిగారు. ”ప్రగతిభవన్‌ను ఆస్పత్రిగా మారుస్తామం. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను తయారు చేసే విధంగా స్టడీసర్కిల్ మారుస్తాం” అన్న హామీని సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పక్కన బెట్టారని ప్రశ్నించారు. చివరకు దాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంగా మార్చారని విమర్శించారు. మెడికల్ కాలేజీలకు కేంద్రం నిధులిచ్చిందని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేస్తే స్వాగతిస్తామన్నారు. అయితే, ఆ అప్పులను సాకుగా చూపెట్టి ఇచ్చిన అలవిగాని హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి అదృష్టవంతుడనీ, ఒకచోట ఓడిపోయినా సీఎం అయ్యారని చెప్పారు. ఆయన దూకుడును తగ్గించి అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సుస్మాస్వరాజ్ పేరును గవర్నర్ ప్రసంగంలో చేర్చకపోవడాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు పొందుపరిస్తే బాగుండేదన్నారు.
పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా దక్కించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. అయితే, జాతీయ హోదా ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకు పోరా? అలాంటప్పుడు హామీ ఎందుకిచ్చారు? అని ప్రశ్నించారు. చేపలు పట్టి ఇవ్వడం కాదు..పట్టుకోవడాన్ని ప్రజలకు నేర్పాలని కాంగ్రెస్ హామీలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
తెలంగాణను అడుగడుగునా అవమానించింది
బీజేపోళ్లే : పొన్నం
మహేశ్వర్‌రెడ్డి ప్రసంగం మధ్యలో మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకున్నారు. ‘బీజేపీవాళ్లకు సిగ్గుండాలే. తెలంగాణను వాళ్లు ఎప్పుడూ అవమానిస్తూనే ఉన్నారు. ”తల్లిని చంపి బిడ్డను వేరుచేశారు” అని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ తెలంగాణను అవమానించింది వాస్తవం కాదా? మిమ్ముల్ని కలుపుకుని 54 మందిమి ఉన్నామని కేటీఆర్ అంటున్నారు. ఇవేం బెదిరింపులు?’ అంటూ సీరియస్ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఉద్యోగాల భర్తీ, పేదలకు ఇండ్లు, ఇండ్లస్థలాల అందజేత, 200 యూనిట్లలోపు వాడుకునే వారికి ఉచిత కరెంటు, తదితర హామీల అమలు కోసం అన్ని పార్టీల సహాయ సహకారాలు తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా ఉందన్నారు. మహేశ్వర్‌రెడ్డి ప్రసంగంలో జోక్యం చేసుకున్న బీఆర్‌ఎస్ సభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్‌తో సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని ప్రతిపాదించారు.