రెన్యువల్‌ చేసుకోలేని రైతుల సంగ‌తేంటి..?

రెన్యువల్‌ చేసుకోలేని రైతుల సంగ‌తేంటి..?– ప్రభుత్వ రుణమాఫీ మార్గదర్శకాలతో రైతుల్లో ఆందోళన
– ఆర్థిక ఇబ్బందులతోనే రెన్యువల్‌కు దూరం
కాంగ్రెస్‌ హామీ మేరకు రూ.2లక్షల పంట రుణాల మాఫీకి ముందుకొచ్చింది. దానికి సంబంధించి జీఓను సైతం విడుదల చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాలతో కొంత మంది రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు పంట రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అవుతుందని భావించగా ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలతో కొంత సందిగ్ధత నెలకొంది. రాజకీయ నాయకులు, ఆదాయ పన్ను కడుతున్న వారు, ఆదాయ పన్ను కట్టన ప్రభుత్వ ఉద్యోగులు, రీషెడ్యూల్‌ చేసుకున్న వారు అనర్హులంటూ వెల్లడించడంతో అలాంటి వారిలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రెన్యువల్‌ చేసుకోలేని వారికి రుణమాఫీ వర్తిస్తుందా? లేదా? అనేది చాలా మంది రైతుల్లో సందేహం నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది రైతులు రుణం తీసుకొని ఇప్పటి వరకు రెన్యువల్‌ చేసుకోలేదు.
నవతెలంగాణ-జైపూర్‌
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ మార్గదర్శకాలతో రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పదేండ్లు, ఐదేండ్ల కిందట పంట రుణాలు తీసుకొని చాలా మంది రైతులు రుణమాఫీ అవుతుందని రుణాలు చెల్లించలేదు. రెన్యువల్‌ కూడా చేసుకోలేదు. తాజాగా ప్రభుత్వం రుణమాఫీకి కటాఫ్‌ తేదీలో పంట రుణం తీసుకొని లేదా రెన్యువల్‌ చేసుకొని ఉంటేనే రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొంది. అయితే చాలా మంది పంట రుణం తీసుకున్న తర్వాత రెన్యువల్‌ చేసుకోకుండా ఉన్నారు. వారు రుణమాఫీకి అర్హులు కారా?అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ధరణి పోర్టల్‌ పుణ్యమా అని…
పంట సాగులో పెట్టుబడులకు సరిపోక, ధరణి పోర్టల్‌ పుణ్యమా అని వ్యవసాయ భూముల విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు ఏర్పడి పంట రుణాలు రెన్యువల్‌ చేసుకోలేని రైతులు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఎకరాల్లో తేడా ఉండటంతో పాటు సరి చేయాల్సిన అధికారులు నిస్సహాయత వ్యక్తం చేసిన కారణంగా పంట రుణాలు రెన్యువల్‌ చేసుకోలేకపోయారు. ధరణి పోర్టల్‌లో ఏర్పడిన హెచ్చుతగ్గుల కారణంగా రెన్యువల్‌ చేసుకోలేని వారిలో నూటికి 90 శాతం మంది ఉంటారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెన్యువల్‌ చేసుకోలేని నిస్సాయ రైతుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురుచూస్తున్నారు. 20, 30 సంవత్సరాలుగా పంట రుణాలు తీసుకోవడం తిరిగి చెల్లించడం జరుగుతుండగా ధరణి పోర్టల్‌ తీసుకొచ్చినప్పట్నుండి విధిలేని పరిస్థితుల్లో రెన్యువల్‌ చేసుకోలేకపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
పదేండ్లుగా ఊరిస్తున్న రుణమాఫీ
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి రైతులను రుణమాఫీ ఊరిస్తూ వస్తోంది. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించిన గత ప్రభుత్వం నాలుగు విడతల్లో పూర్తి చేస్తామని చెప్పింది. మొదటి విడతలో రూ.25వేలు, రెండో విడతలో రూ.50వేలు, మూడో విడతలో రూ.75 ముక్కుతూ మూలుగుతూ ఈడ్చుకొచ్చింది. నాల్గవ విడత రూ.లక్ష రుణమాఫీ పొందిన వారిని క్షేత్రస్థాయిలో గుర్తించాల్సి వస్తోంది. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా ఆగస్టు 15లోపు రైతులను రుణ విముక్తులను చేసేందుకు కసరత్తు చేస్తోంది. పంట రుణం పొందిన ప్రతి ఒక్కరి రుణం మాఫీ అవుతుందని భరోసా ఉండేది. రీషెడ్యూల్‌ చేయించుకున్న రైతులు రుణమాఫీకి అనర్హులని ప్రకటించడంతో పదేండ్లుగా ఊరించిన రుణమాఫీకి వారు దూరమవుతున్నారు.
రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించక డిఫాల్టర్లుగా ముద్రపడ్డ రైతులందరు కూడా మారుమూల ప్రాంతాలకు చెందిన చిన్న సన్నకారు రైతులే. వ్యవసాయం తప్ప మరో మార్గం లేక పంటలు సాగు చేసుకుంటూ పెట్టుబడుల కోసం బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ బ్యాంకు అధికారుల సమ్మతితో తీసుకున్న రుణం తిరిగి చెల్లించి రుణాలను రీషెడ్యూల్‌ చేయించుకున్న తీరు రుణమాఫీకి అడ్డంకిగా మారిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిపాల్టర్లుగా ముద్రపడ్డ రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని అభ్యర్థిస్తున్నారు. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రెన్యువల్‌ చేసుకోని రైతుల పంట రుణాలు కూడా మాఫీ చేసేలా ప్రభుత్వం ముందుకు రావాలని పలువురు రైతులు కోరుతున్నారు.